హైదరాబాద్, వెలుగు: పాత బస్తీ బోనాలు ఆదివారం జరగనున్నాయి. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ఇందుకోసం ముస్తాబైంది. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు పెట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకం తర్వాత బోనాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా సిటీలోని ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి అమ్మవారు
హరిబౌలి అక్కన్న మాదన్న, కోవబేటా బంగారు మైసమ్మ, రాంబక్షిబండ బంగారు మైసమ్మ, బేటా చందూలాల్ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపురా మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చాంద్రయణగుట్ట బంగారు మైసమ్మ, కుమ్మర్ వాడీ కనకదుర్గ తదితర ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సోమవారం రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెలు, ఫలహారపు బండ్ల ఊరేగింపు కొనసాగనుంది. ఈ నెల 27న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ తర్వాత ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. మరోవైపు బోనాలు సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

