
ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద గతంలోనూ పలువురు అనర్హతకు గురయ్యారు. ఇందులో మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత తదితరులు ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్: దాణ కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో 2013 సెప్టెంబర్‌లో ఎంపీగా అనర్హతకు గురయ్యారు. అప్పుడు బీహార్‌లోని సరన్ నుంచి ఎంపీగా ఉన్నారు.
జయలలిత: అక్రమ ఆస్తుల కేసులో కోర్టు దోషిగా తేల్చడంతో 2014 సెప్టెంబర్‌లో తమిళనాడు అసెంబ్లీ సభ్యురాలిగా అనర్హతకు గురయ్యారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయ.. అనర్హత వేటు పడటంతో పదవికి రాజీనామా కూడా చేశారు.
పీపీ మొహమ్మద్ ఫైజల్: హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ పీపీ మొహమ్మద్ ఫైజల్.. 2023 జనవరిలో అనర్హతకు గురయ్యారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పును కేరళ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని లోక్‌సభ సెక్రటేరియట్‌కు న్యాయ శాఖ సిఫార్సు చేసింది. అయితే లోక్‌సభ సెక్రటేరియట్ ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు.
ఆజం ఖాన్: విద్వేష వ్యాఖ్యల కేసులో 2022 అక్టోబర్‌లో 3 ఏండ్ల జైలు శిక్ష పడింది. దీంతో యూపీ అసెంబ్లీలో అనర్హత వేటు వేసింది. ఈయన రామ్‌పూర్ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అనీల్ కుమార్ సాహ్ని: మోసం చేసిన కేసులో ఈయనకు 2022 అక్టోబర్‌లో మూడేండ్ల జైలు శిక్ష పడింది. దీంతో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హతకు గురయ్యారు. కుర్హానీ అసెంబ్లీ సీటు నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా గెలిచారు.
విక్రమ్ సింగ్ సైనీ: 2022 అక్టోబర్‌లో అనర్హత వేటు పడింది. 2013లో యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ముజఫర్‌నగర్ లోని ఖతౌలి నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రదీప్ చౌధరి: 2021 జనవరిలో అనర్హతకు గురయ్యారు. దాడి కేసులో కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. హర్యానాలోని కోల్కా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కుల్దీప్ సింగ్ సెంగార్: 2020 ఫిబ్రవరిలో అనర్హతకు గురయ్యారు. రేప్ కేసులో దోషిగా తేలారు. యూపీ ఉన్నావ్‌లోని బంగర్‌మవ్ నుంచి గెలిచారు. ఈయన్న బీజేపీ బహిష్కరించింది.
అబ్దుల్లా ఆజం ఖాన్: 2023 ఫిబ్రవరిలో అనర్హత వేటు పడింది. 15 ఏండ్ల కిందటి కేసులో కోర్టు రెండేండ్ల శిక్ష విధించింది. యూపీ రామ్‌పూర్‌లోని సువర్ నుంచి గెలిచారు.