అధికారులకు కత్తిమీద సాములా మారిన భూ సేకరణ

అధికారులకు కత్తిమీద సాములా మారిన భూ సేకరణ
  • పరిహారం తేల్చని రాష్ట్ర ప్రభుత్వం
  • రూ.7,612 కోట్ల నుంచి రూ.10,573 కోట్లకు డీపీఆర్
  • ప్రస్తుత రేటుకే భూములు ఇస్తామంటున్న రైతులు

పెద్దపల్లి, వెలుగు: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ నేషనల్ హైవేకు ఆటంకాలు తప్పడం లేదు. కేంద్రం ప్రెస్టీజ్ గా తీసుకొని నిర్మించతలపెట్టిన నేషనల్ హైవేకు 31 జులై 2015లో భారత్​మాల పరియోజన స్కీం ద్వారా శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా నుంచి మంథని మీదుగా వరంగల్ జిల్లా వరకు కొత్తగా రోడ్డు నిర్మించతలపెట్టారు. 112 కిలో మీటర్ల పరిధిలో 2 ఫ్లై ఓవర్లు, 11 అండర్ పాస్​లు నిర్మించనున్నారు. రోడ్డుకు సంబంధించి రూ.7,612 కోట్లతో డీపీఆర్ రూపొందించారు. పెరిగిన నిర్మాణ వ్యయాలు, భూముల ధరలకు అనుగుణంగా ఇటీవల ఎన్​హెచ్ఏఐ ఆఫీసర్లు సర్వే చేసి రోడ్డు నిర్మాణానికి రూ.10,573 కోట్లతో డీపీఆర్ రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ వరకు నిర్మించనున్న రోడ్డు కోసం ఏడాది నుంచి భూ సేకరణ జరుగుతోంది. 

సర్కార్ తీరుతోనే లేటు..

భూసేకరణ విషయంలో తెలంగాణ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రోడ్డు నిర్మాణం ఆలస్యమవుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు 310 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి మంథని, వరంగల్ వరకు 110 కిలో మీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 4,350 ఎకరాల భూమి అవసరం. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 1,767 ఎకరాలు కావాలి. రైతులను సంప్రదింపులు జరుపకుండా భూసేకరణ చేస్తుండడంతో వారంతా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో రైతులు పనులను అడ్డుకుంటున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం 1000 ఎకరాలు దాటితే పబ్లిక్ హియరింగ్ జరిపి 2013 చట్ట పరిధిలో సేకరణ చేపట్టాలి. కానీ అధికారులు మాత్రం ఒకే ప్రదేశంలో 1000 ఎకరాలు సేకరించినప్పుడే పబ్లిక్ హియరింగ్ అవసరమని, మూడు జిల్లాల పరిధిలో 1,767 ఎకరాలు అవసరమైంది కాబట్టి పబ్లిక్ హియరింగ్​తోపాటు భూసేకరణ చట్టం కూడా అవసరం లేదని చెబుతున్నట్లు సమాచారం. ఇందుకు రైతులు ఒప్పుకోకపోవడంతో భూసేకరణ అధికారులకు కత్తి మీద సాములా మారింది.    

హైవే పూర్తయితే తగ్గనున్న దూరం..

ప్రస్తుతం మంచిర్యాల నుంచి వరంగల్ వెళ్లడానికి వయా గోదావరిఖని, కరీంనగర్, హుజురాబాద్ మీదుగా 160 కిలో మీటర్లు తిరగాలి. కొత్త హైవే పూర్తయితే దాదాపు 60 కిలో మీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది. జమ్మికుంట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు తక్కువ సమయంలో చేరవచ్చు. ఈ రోడ్ సైడ్ చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావడంతోపాటు భూముల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, రసూల్పురా, కుందారం, కిష్టాపూర్, వేలాల, గోపాలపూర్ నుంచి గోదావరి నది మీద నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పోతారం, విలోచవరం, మల్లెపల్లి, పుట్టపాక, రామగిరి మండలంలోని ఆదివారం పేట, బేగంపేట, లక్కారం, ముత్తారం మండలంలోని మచ్చుపేట, కేశనపల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడెడు, మానేరు నది మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల, గిద్దె ముత్తారం, అంకుశాపూర్, వెంకటపూర్, పసరకొండ, గూరెప్పాడ్, ఆరెపల్లి ద్వారా వరంగల్ వరకు ఫోర్​లైన్​వే నిర్మించనున్నారు. దీంతో ప్రజలకు దూరభారం తగ్గటంతో పాటు రవాణ సౌకర్యాలు మెరుగవుతాయి.

భూములిచ్చి రోడ్డు పాలు కాము

నేషనల్ హైవే కింద మా భూములు తీసుకుంటామని సర్కార్ చెప్తోంది. రైతులతో ఎలాంటి చర్చలు లేకుండా భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. భూములిచ్చి మేమంతా రోడ్ల పాలు కాము, ఏడాదికి రెండు పంటలు పండే భూములను ఇచ్చి మేము ఎట్లా బతుకుడు. రాష్ట్ర సర్కార్ న్యాయం చేస్తదనే నమ్మకం లేదు.

- నూనేటి కృష్ణ, ముత్తారం, పెద్దపల్లి జిల్లా