
- ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
- ఇప్పటికే పూర్తయిన ప్రతిపాదనలు
- త్వరలో అభ్యంతరాలు, అభిప్రాయాల సేకరణ
- భూముల విలువ కనీసం 30 నుంచి 50 శాతం పెంచే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఏయే భూముల విలువ ఎక్కడెక్కడ ఎంతమేర పెంచాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెలాఖరులో అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనుంది. ఆ తర్వాత మార్పుచేర్పులు చేసి భూముల విలువ పెంపుపై సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుందని సెక్రటేరియెట్ లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెంచిన భూముల విలువ ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలనే దానిపై ఈ నెల17లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో దసరా నుంచి కొత్త మార్కెట్ వ్యాల్యూ అమలు చేయనుందని తెలిసింది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే ఈ నెల ఒకటో తేదీ నుంచే కొత్త మార్కెట్ వ్యాల్యూ అమల్లోకి రావాలి. అయితే బహిరంగ మార్కెట్లో ఉన్న భూముల ధరలపై మరింతగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇటీవల జిల్లా రిజిస్ర్టార్లు, సబ్ రిజిస్ర్టార్ల బదిలీలు జరగడంతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. కాగా, భూముల విలువ పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి.
వ్యవసాయ భూముల విలువ భారీగా పెంపు!
గ్రామాల్లో సాగునీటి వసతులు ఉన్న భూముల ధరలు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉన్నాయి. సాగునీటి వసతులు లేని రాళ్లు, రప్పలతో కూడిన భూముల ధరలు సైతం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉన్నాయి. కానీ వీటి మార్కెట్ విలువలు మాత్రం రూ.16 వేల నుంచి మొదలుకుని గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి.
అదే హైవేలు, రోడ్ల పక్కన ఉన్న వ్యవసాయ భూములకు కొన్నిచోట్ల ఎకరం రూ.కోటి దాకా పలుకుతున్నది. మరికొన్ని చోట్ల ఎకరం రూ.75 లక్షలకు తక్కువగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో భూముల విలువ భారీగానే పెంచనున్నారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల విలువను పెద్ద మొత్తంలో పెంచనున్నట్టు తెలుస్తున్నది. అదే సమయంలో ప్లాట్ల విలువను 15 శాతం వరకే పెంచనున్నట్టు సమాచారం.
గత ప్రభుత్వం 2021, 2022లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను పెంచింది. ఆ టైమ్ లో తక్కువ ధరలు ఉన్న చోట 50 శాతం, మధ్యస్థంగా ఉంటే 40 శాతం, ఎక్కువగా ఉంటే 30 శాతం వరకు ఒకే విధంగా పెంచారు. ఈసారి అలా కాకుండా భూముల వాస్తవ, మార్కెట్ విలువల మధ్య భారీ తేడాలు లేకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
క్షేత్రస్థాయిలో అధ్యయనం పూర్తి..
భూముల ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ, బహిరంగ మార్కెట్ వ్యాల్యూను కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు అధ్యయనం చేసి.. ఏ మేరకు భూముల విలువ పెంచవచ్చో ప్రతిపాదనలు రూపొందించాయి. ఆ అంచనాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్- ఇన్‌స్పెక్టర్ జనరల్ (సీఐజీ) ప్రధాన కార్యాలయానికి అందజేశాయి. మార్కెట్ విలువ పెంపుపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా క్షేత్రస్థాయి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 143 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ భూములు, ఇతర స్థలాలు, వెంచర్లు, అపార్ట్ మెంట్లకు సంబంధించి అధ్యయనం చేసింది. యావరేజ్‌గా చూస్తే భూముల విలువ కనీసం 30 నుంచి 50 శాతం మేర పెరగనున్నట్టు తెలిసింది. అయితే వ్యవసాయ భూముల విలువ మాత్రం 50 నుంచి 100 శాతం కూడా పెరిగే చాన్స్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.