- యాదాద్రి జిల్లాలో భూముల విలువ పెంపునకు కసరత్తు
- రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువ సేకరించిన తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు
- సర్కారుకు చేరిన లెక్కలు
- గరిష్టంగా ఎకరానికి రూ. 1.36 కోట్లుగా రిజిస్ట్రేషన్ విలువ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువల నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. మార్కెట్విలువను ప్రభుత్వం సవరిస్తే భువనగిరి, భూదాన్‌పోచంపల్లిలో భూములకు మస్తు డిమాండ్ పెరగనుంది.
మార్కెట్ విలువ సేకరణ..
భూముల మార్కెట్ విలువను సవరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తహసీల్దార్లు, సబ్ రిజిస్టార్లు సర్వే నెంబర్ల వారీగా మార్కెట్ విలువ సేకరించారు. ఏఏ సర్వే నెంబర్లలో భూమి నేషనల్, స్టేట్ హైవేలతో పంచాయతీ రోడ్ల పక్కన ఉన్నాయో వివరాలను సేకరించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేని భూములను డేటా సేకరణలో అర్బన్, కమర్షియల్, రూరల్ విభాగాలుగా భూములను విభజించారు. వెంచర్లలోని ప్లాట్లకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు బహిరంగ మార్కెట్లో ఆ భూములు విలువ ఎంత ఉందో సేకరించారు.
మార్కెట్ వ్యాల్యూ రూ. 1.36 కోట్లు..
జిల్లాలో భూముల ప్రస్తుత రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, ఆలేరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల మార్కెట్ రేట్లతో పాటు బహిరంగ మార్కెట్లోనూ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మార్కెట్ వ్యాల్యూ మరీ తక్కువగా ఉంది. భువనగిరి టౌన్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని పలు సర్వే నెంబర్లలో ఎకరం ధర రూ. 1.36 కోట్లు, రూ. 1.18 కోట్లు, భూదాన్ పోచంపల్లిలో ఎకరానికి రూ. 1.18 కోట్లుగా ఉంది.
మిగిలిన చోట్ల రూ. 75 వేల నుంచి రూ. 94 లక్షల వరకూ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉంది. జిల్లాలో ఎక్కడెళ్లినా ఎకరాకు రూ. 20 లక్షలకు తక్కువ లేదు. మండల హెడ్ క్వార్టర్ లో ఎకరాకు రూ. కోటికి పైగా అర్బన్ ప్రాంతాలకు వస్తే ఎకరాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ పలుకుతోంది. ఇండ్ల స్థలాల విషయానికొస్తే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ గ్రామాల్లో గజం రూ. 500 నుంచి రూ. 2,200 వరకూ ఉంది. అర్బన్ఏరియాల్లో గజం రూ. 7 వేల నుంచి రూ. 21,200 వరకూ ఉంది.
బహిరంగ మార్కెట్ విషయానికొస్తే ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లినా గజం రూ. 5 వేలకు తక్కువగా లేదు. మోత్కూరు, ఆత్మకూరు (ఎం) లాంటి మండలాల్లో గజం రూ. 20 వేలకు తక్కువగా లేదు. ఇక భువనగిరి, చౌటుప్పల్ విషయానికొస్తే నేషనల్ హైవేపై గజం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ పలుకుతోంది.
విలువ సవరిస్తే ఇలా..
యాదాద్రి జిల్లా మీదుగా విజయవాడ, వరంగల్ హైవేలు వెళ్తుండగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట టెంపుల్ఈ జిల్లాలోనే ఉంది. గత ప్రభుత్వం ఈ టెంపుల్ డెవలప్మెంట్ను చేపట్టడంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకొంది. బహిరంగ మార్కెట్లో ఇక్కడి భూముల విలువ భారీగా పెరిగాయి. మార్కెట్ విలువను రూరల్, అర్బన్, కమర్షియల్ విభాగాల్లో వేర్వేరుగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా పెంచితే ఒక్కోచోట ఒక్కో విధంగా భూముల మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. భూముల మార్కెట్ విలువను 10 శాతానికి తగ్గకుండా, 100 శాతానికి మించకుండా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో జిల్లాలో భారీ ఎత్తున మార్కెట్ విలువ పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఇదే జరిగితే భువనగిరిలో అత్యధికంగా ఎకరానికి రూ. 1.36 కోట్లు ఉన్న భూమికి మధ్యస్తంగా 30 శాతం మార్కెట్ వ్యాల్యూ పెంచితే రూ. 1.72 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భూదాన్ పోచంపల్లిలో ఎకరానికి రూ. 1.18 కోట్లుగా ఉంటే మార్కెట్ వ్యాల్యూ పెరిగితే రూ. 1.54 కోట్లకు పెరగనుంది. భువనగిరి మెయిన్ రోడ్డుపై గజం రూ. 32,200 ఉండగా మార్కెట్ వ్యాల్యూ పెరిగిన తర్వాత గజం రూ. 42 వేలు అవుతుంది.
కొనుగోళ్లపై ఎఫెక్ట్!
భూముల మార్కెట్ విలువ పెంచితే కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశముందని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ బిజినెస్ వెనుకబడిందని, ఇప్పటికే క్రయ విక్రయాలు చాలా వరకూ తగ్గిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్ విలువ పెరిగితే, స్టాంప్ డ్యూటీ పెరిగి ఆ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని
అభిప్రాయపడుతున్నారు.
భూమి విలువ ఎక్కువ ఇక్కడే..
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో రేటు ఎక్కువగా ఉంది. భువనగిరి మండలంలోని భువనగిరి, రాయగిరి సహా సూరేపల్లి వరకూ దాదాపు 25 గ్రామాల్లోని వందలాది సర్వే నెంబర్లలోని భూములకు అత్యధికంగా ధర పలుకుతాయని గుర్తించారు.
భువనగిరి టౌన్లో ఎల్లమ్మ టెంపుల్ నుంచి జగదేవ్‌పూర్ చౌరస్తా, పాత బస్టాండ్, నల్గొండ రోడ్‌లోని స్థలాలను కమర్షియల్ జోన్‌గా పేర్కొన్నారు.
చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు సహా పలు మండలాల్లో మెయిన్ రోడ్డు పరిసరాల్లో ఉన్న భూములను ఎక్కువ విలువగల భూములుగా గుర్తించారు.
బొమ్మల రామారం మండలంలో వందకు పైగా గుర్తించిన సర్వే నెంబర్లలో సుమారు 60 నెంబర్లను ప్రైమ్ ల్యాండ్‌గా పేర్కొన్నారు. వీటిలో బొమ్మల రామారంతో పాటు నాగినేనిపల్లి, మర్యాల, చీకటిమామిడి, రామలింగంపల్లి, రంగాపూర్, మేడిపల్లి గ్రామాలూ ఉన్నాయి. రూరల్ మండలాల్లో మధ్యస్తంగా విలువగల భూములుగాగుర్తించారు.
