పేదల భూములు కబ్జా !..మంచిర్యాల శివారు 290 సర్వే నంబర్‌‌లో వివాదాస్పదంగా మారిన ప్లాట్లు

పేదల భూములు కబ్జా !..మంచిర్యాల శివారు 290 సర్వే నంబర్‌‌లో వివాదాస్పదంగా మారిన ప్లాట్లు
  • 2004లో వెంచర్‌‌.. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు
  • 1.25 ఎకరాలు తనదేనంటూ కాంపౌండ్‌‌ కట్టిన లీడర్‌‌
  • ప్లాట్లుగా మార్చి అమ్మేసేందుకు యత్నం.. కాంపౌండ్‌‌ కూల్చిన బాధితులు 
  • న్యాయం చేయాలంటూ పోలీసులు, కలెక్టర్‌‌కు ఫిర్యాదు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రం గర్మిళ్ల శివారులోని సర్వే నంబర్‌‌ 290లో గల 1.25 ఎకరాల భూమి ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ భూమిలో కొందరు రియల్టర్లు 20 ఏండ్ల కింద వెంచర్‌‌ చేయడంతో పలువురు ప్లాట్లు కొనుక్కున్నారు. అప్పటి నుంచి కబ్జాకు గురికాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఓ లీడర్‌‌ తెరమీదకు వచ్చి... ఆ భూమిని తాను కొనుగోలు చేశానని చెబుతూ చుట్టూ కాంపౌండ్‌‌ కట్టాడు. దీంతో ప్లాట్లు కొనుక్కున్నవారు అయోమయానికి గురయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.

తొమ్మిది ఎకరాల్లో వెంచర్‌‌

మంచిర్యాల శివారులోని 290 సర్వే నంబర్‌‌లో మొత్తం 19.20 ఎకరాల భూమి ఉంది. 2004లో కొందరు రియల్టర్లు సుమారు తొమ్మిది ఎకరాల్లో వెంచర్‌‌ చేసి 137 ప్లాట్లను అమ్మేశారు. ఇందులో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్‌‌ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ప్లాట్లు కొనుక్కున్నారు. వీరికి మంచిర్యాల అప్పటి మండల రెవెన్యూ అధికారి ప్రొసీడింగ్స్‌‌ సైతం జారీ చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగాయి. ఇక్కడ ప్లాట్లు కొన్నవారు సిమెంట్‌‌ దిమ్మెలు, పోల్స్‌‌నాటి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. తరచూ ప్లాట్లను క్లీన్‌‌ చేసుకుంటూ కబ్జాకు గురికాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ప్లేస్‌‌ కాస్త డెవలప్‌‌కాగానే ఇండ్లు కట్టుకోవడానికి, అవసరమైతే పిల్లల చదువుల కోసం అమ్ముకోవడానికి ప్లాన్‌‌ చేసుకున్నారు.

భూమి తనదేనంటూ రంగంలోకి దిగిన లీడర్‌‌

ఇరవై ఏండ్ల కిందట వెంచర్‌‌ చేసిన ప్లేస్‌‌ తనదేనంటూ ఇటీవల పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రామగుండం మాజీ కార్పొరేటర్‌‌ ముదాం శ్రీనివాస్‌‌ తెరపైకి వచ్చాడు. మంచిర్యాలకు చెందిన డాక్టర్‌‌ సుభాష్ చంద్రబోస్‌‌ అనే వ్యక్తి వద్ద 1.25 ఎకరాల భూమిని కొన్నానంటూ 21 ప్లాట్లను ఆక్రమించుకొని జనవరి 21న కాంపౌండ్‌‌ నిర్మించాడు. దీంతో ప్లాట్ల యజమానులు ఖంగుతిన్నారు. శ్రీనివాస్‌‌ వద్దకు వెళ్లి ఇదేమిటని ప్రశ్నించగా... సర్వేనంబర్‌‌ 290లో సుభాష్ చంద్రబోస్‌‌కు 1980 నుంచి 1.25 ఎకరాలకు పట్టా ఉందని, ఆయన దగ్గర తాను కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు.

ఈ భూమి విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా సమస్య కొలిక్కి రాలేదన్నారు. దీంతో ఏప్రిల్‌‌ 2న బాధితులు ప్లాట్ల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఇరువర్గాలు పోలీస్‌‌స్టేషన్‌‌లో సైతం ఫిర్యాదు చేయగా కేసులు నమోదు అయ్యాయి. సర్వేనంబర్‌‌ 290లో సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యేను, రామగుండం సీపీని కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌‌కు వచ్చి కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. 

పట్టా భూమిని కొన్నా 

సర్వేనంబర్‌‌ 290లో డాక్టర్‌‌ సుభాష్ చంద్రబోస్‌‌కు 1.25 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరిట 1980 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ భూమిని నేను కొనుగోలు చేసిన. సర్వే చేయించి కాంపౌండ్‌‌ వేసుకున్న. నేను ఎవరి ప్లాట్లను కబ్జా చేయలేదు. 2004లో వెంచర్‌‌ చేసిన రియల్టర్లే వాళ్లను మోసం చేశారు.ఈ సర్వేనంబర్‌‌లో రియల్టర్లకు ఉన్న భూమి కంటే ఎక్కువ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మేసిన్రు. నేను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ విచారణకైనా సిద్ధం.- ముదాం శ్రీనివాస్​

ఖాళీగా ఉందని కబ్జా చేసిండు 

సర్వేనంబర్‌‌ 290లోని ప్లాట్లను మేము 2004లోనే కొన్నం. ఇరవై ఏండ్ల నుంచి ఈ భూమి దిక్కు ఎవరూ రాలేదు. ముదాం శ్రీనివాస్‌‌ అనే వ్యక్తి ఉన్నఫలంగా వచ్చి 21 పాట్లను కబ్జా చేసిండు. తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని దబాయిస్తుండు. అతడి వెనుక కొంతమంది లీడర్లు ఉండి ఇదంతా చేయిస్తున్నరు. మేము ఎంతో కష్టపడి ఈ ప్లాట్లు కొనుక్కున్నం. కలెక్టర్‌‌ స్పందించి మాకు న్యాయం చేయాలె.-290 సర్వే నంబర్‌‌ ప్లాట్ల బాధితులు