రోజురోజుకూ పెరుగుతున్న భూ వివాదాలు

రోజురోజుకూ పెరుగుతున్న భూ వివాదాలు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో భూముల వివాదాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల తీరుతో రోజుకోచోట గొడవలు జరుగుతున్నాయి. ఆఫీసర్లు అధికార పార్టీ లీడర్లకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ, ప్రజాసంఘాల లీడర్లు ఆందోళనకు దిగుతున్నారు. భూ వివాదంలో బాధితుడిపైనే చేయి చేసుకున్న దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావును సస్పెండ్ చేయాలంటూ బీజేపీ లీడర్లు గురువారం డీఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట  ధర్నాకు దిగారు. రెండు రోజుల క్రితం మరో ల్యాండ్ ఇష్యూలో మర్రిగూడ రెవెన్యూ ఆఫీసర్లను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేయాలంటూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో మర్రిగూడలో దీక్ష చేశారు. మునుగోడు మండలం చీకటిమామిడిలో దేవాలయ భూములను ఆక్రమించిన వారికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అండగా నిలుస్తున్నారని సొంత పార్టీ లీడర్లే ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. 

చిచ్చుపెడుతున్న భూముల పంచాయితీలు..

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 980లో తనకు గల 20 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయించుకున్నారని గోల్కొండ రాధ అనే మహిళ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట 9 రోజులుగా దీక్ష చేస్తోంది. ఆమెకు భూమి అమ్మిన చిట్యాల స్తంభారెడ్డి పేరు మీదనే రికార్డులు ఉండడంతో ధరణి వచ్చాక అతడికే పాస్‌‌‌‌‌‌‌‌పుస్తకాలు జారీ చేశారు. దీంతో స్తంభారెడ్డి, అతడి కుమారులు ఆ భూమిని ఇటీవల మరొకరికి అమ్మారు. పంచాయతీ రికార్డులో మాత్రం పొజిషన్‌‌‌‌‌‌‌‌లో రాధ పేరే ఉందని చెపుతున్నారు. కానీ రెవెన్యూ ఆఫీసర్లు ఇవేమీ ఎంక్వైరీ చేయకుండా పాసు పుస్తకాలు ఇచ్చారు. దీంతో తనకు న్యాయం చేయాలని రాధ దీక్షకు దిగింది. అయినప్పటికీ రెవెన్యూ ఆఫీసర్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కులవివక్షణ పోరాట సమితి నాయకులు బుధవారం తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సిబ్బందిని నిర్బంధించారు. దీంతో ఆర్డీవో సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆ మహిళ దీక్ష విరమించకుండా ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

మునుగోడు మండలం చీకటిమామిడిలోని రెండు ఎకరాల రామాలయం భూమిలో కొందరు వ్యక్తులు గుడిసెలు, గడ్డివాములు వేసుకున్నారు. ఇదే భూమిలో గ్రామీణ క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు నిర్ణయించి స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కబ్జాదారులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అండగా నిలిచి వారు ఖాళీ చేయకుండా అడ్డుపడుతున్నారని అదే గ్రామానికి మరో వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా మూడు రోజుల క్రితం మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు.