నకిలీ పత్రాలతో భూకబ్జాలు , లోన్లు... ఖాళీ జాగాలకు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు

నకిలీ పత్రాలతో భూకబ్జాలు , లోన్లు... ఖాళీ జాగాలకు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు
  • చింతకుంట సర్వే నంబర్ 212, 214లో మల్లవ్వ ముఠా నయాదందా
  • బాధితుల్లో పోలీస్ కానిస్టేబుల్ 
  • తప్పుడు డాక్యుమెంట్లతో వంద ప్లాట్లకుపైగా రిజిస్ట్రేషన్లు
  • రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పాత్రపైనా అనుమానాలు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్నాళ్లుగా సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న భూమాఫియా మళ్లీ కోరలు చాస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూకబ్జాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. పోలీసులు ఓ వైపు కేసులు న మోదు చేస్తున్నా కొందరు భూకబ్జాదారుల తీరు మారడం లేదు. ఐదారేళ్ల కింద దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఖాళీ ప్లాట్లను ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నారు.

ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో కొనుగోలుదారులకు కూడా అనుమానం రావడం లేదు. తీరా ల్యాండ్ మీదికి వెళ్లి పనులు ప్రారంభించాక అసలు విషయం బయటపడడంతో లబోదిబోమంటున్నారు. తాజాగా కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన కిన్నెర మల్లవ్వ ముఠా ఇలా సుమారు వంద ప్లాట్లకుపైగా దొంగపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ ముఠా దగ్గర ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు.    

ఖాళీ జాగలకు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు

కరీంనగర్ శివారులోని చింతకుంట రెవెన్యూ పరిధిలోని 212, 214 సర్వే నంబర్లలో భూములను ఆయా పట్టాదారులు గతంలో ప్లాట్లుగా చేసి అమ్మారు. ఇందులో సుమారు వందకుపైగా ప్లాట్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. ఈ ప్లాట్ల గురించి తెలిసిన కిన్నెర మల్లవ్వ ముఠా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మొదలుపెట్టింది. ఇందులో చాలా ప్లాట్ల తొలుత కిన్నెర మల్లవ్వ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి.

ఆమె పేరు నుంచి ముఠాలోని మరొకరి పేరిట, కొద్దినెలల తర్వాత మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేవారు. ఇలా నలుగురైదుగురి పేరిట చేతులు మారేలా చేసి లింక్ డాక్యుమెంట్లు సృష్టించేవారు. ఆ తర్వాత మధ్యవర్తుల ద్వారా అమ్మకానికి పెట్టేవారు. ఇలా పదుల సంఖ్యలో ప్లాట్లను అమ్మేసి.. కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇప్పటికే ఈ ముఠా బాధితులు 11 మంది కరీంనగర్ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. బాధితుల్లో రూ.70 లక్షలు నష్టపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండడం గమనార్హం. ఇదే ముఠాపై జనవరి 28న భూకబ్జా కేసుతోపాటు, కిన్నెర మల్లవ్వపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మల్లవ్వ ముఠా బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. అడ్వకేట్‌‌‌‌గా చలామణీ అవుతూ ఓ పార్టీకి చాలా ఏళ్లు జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఇటీవల బహిష్కరణకు గురైన వ్యక్తి కూడా ఈ ముఠాలో ఉండడం గమనార్హం.

ఫైనాన్స్ కంపెనీలతో కుమ్మక్కు

నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ పద్ధతిలో తమ పేర్లపై ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ఈ ముఠా ఇతరులకు అమ్మడంతోపాటు కొన్ని ప్లాట్ల కాగితాలను ప్రైవేట్ బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.లక్షల్లో లోన్లు కూడా తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. దీంతో జనవరి 28న నమోదైన కేసులో పోలీసులు వీరిని కూడా నిందితులు కూడా చేర్చారు.

కాగా ఈ ముఠాకు, ఆ ప్లాట్లకు ఎలాంటి సంబంధం లేకపోయినా నకిలీ పత్రాలు చూసి గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో  రిజిస్ట్రేషన్లు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు, అప్పటి సబ్ రిజిస్ట్రార్లే ఈ ముఠాకు సహకరించినట్లు తెలుస్తోంది. వారి పాత్రపైనా విచారణ జరపాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

 బాధితులు ఫిర్యాదు చేయాలి

మల్లవ్వ ముఠా చేతిలో ఇప్పటికే 11 మంది వరకు మోసపోయినట్లు, అలాగే కొందరి భూమి ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. బాధితులు ఎవరున్నా నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - సృజన్ రెడ్డి, సీఐ, కరీంనగర్ టూ టౌన్