
మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సి పాలిటీలోని ప్రభుత్వ స్థలాలను టీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మద్ది శంకర్ ఆరోపించారు. ఆదివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన 148 సర్వేనంబరులోని ఖాళీ స్థలాలను టీఆర్ఎస్ లీడర్లు యథేచ్ఛగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. పాలచెట్టు నుంచి దొరల బంగ్లా వరకు గల కోల్ బెల్ట్ రహదారిని ఆనుకొని అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులుగా చలామణి అవుతున్న కొందరు టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి షట్టర్లు, రూములు, షాపింగ్ కాంప్లెక్స్ లు కడుతున్నారని అన్నారు. దొరల బంగ్లా ఏరియాలోని బస్ షెల్టర్ పక్కన ఎంపీ అనుచరునిగా చలామణి అవుతున్న టీఆర్ఎస్ లీడర్ ఒకరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని రెండు షట్టర్లతో రూమ్లు నిర్మించినట్లు చెప్పారు.
మార్కెట్ ప్రాంతం గడ్డివాముల ఎదురుగా ఉన్న విలువైన స్థలాన్ని టీఆర్ఎస్ లీడర్, కుల సంఘం బాధ్యుడు ఆక్రమించుకొని షాప్ కడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. దొరల బంగ్లా ఏరియాలో వినాయకుని మండపం పేరుతో ఉన్న స్థలంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, మూడు ఇండ్లు అక్రమంగా ఏర్పాటు చేశారని, మరికొందరు ప్రభుత్వ భూమిలో ఇటుకలు వేసి కబ్జా చేశారన్నారు. స్థానిక ఎంపీడీవో ఆఫీస్ వెనుక స్థలాన్ని ఒక మహిళా లీడర్ కబ్జా చేశారన్నారు. మోడల్ స్కూల్ వెనుక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పక్కన ఆక్రమించుకున్న స్థలాన్నియువ నాయకులు విక్రయించినట్లు ఆరోపించారు. ఎమ్మెల్యే కాలనీ, మార్కెట్, ఒర్రెగడ్డ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేశారన్నారు. భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.