సంసారాల్లో పట్టా పాసుపుస్తకాల చిచ్చు

సంసారాల్లో పట్టా పాసుపుస్తకాల చిచ్చు

పట్టాదారు పాసు పుస్తకాల జారీ ఆలస్యమవుతుండటంతో సంసారాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ ఆవేదన తట్టుకోలేక తల్లులు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు తహసీల్దార్ కార్యాలయం గేట్లు మూసి అరగంట సేపు తహసీల్దార్ ను కార్యాలయం లోనే నిర్బంధించిన ఘటన బుధవారం జరిగింది. రేవూరు రెవెన్యూ గ్రామ పరిధిలో 17, 1088 సర్వే నంబర్లలో కలిపి సుమారు 870 ఎకరాల భూమి ఉంది. ఇందులో 200 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారు. ఈ భూమికి 1975లోనే ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అప్పట్నుంచి వంద మంది రైతులు దాన్ని సాగు చేసుకుంటున్నారు.

కొందరు రైతులు వారి భూమిని విక్రయించారు. మిగిలిన రైతులు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ పలుసార్లు రెవెన్యూ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లోనూ అధికారులను నిలదీశారు. రెండు రోజుల్లో పాసుబుక్​లు అందజేస్తామని సర్ది చెప్పారు. రెండు రోజులు గడిచాక కూడా తహసీల్దార్ స్పందించడం లేదంటూ బుధవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎమ్మార్వోను కాసేపు గదిలోనే నిర్బంధించారు.

సంసారాల్లో చిచ్చు

తమ కూతుళ్ల సంసారాల్లో పాసు పుస్తకాలు చిచ్చు పెట్టాయంటూ గ్రామంలోని తల్లిదండ్రులు వాపోతున్నారు. కూతుళ్ల పెళ్లి సమయంలో కట్నం కింద భూమిని అల్లుళ్లకు ఇచ్చామన్నారు. ఏళ్లు గడుస్తున్నా కొత్త పాసు పుస్తకాలు రాకపోవడంతో విసుగు చెందిన అల్లుళ్లు అసలా భూమి సరైంది కాదంటూ కూతుళ్లను పుట్టింటికి పంపారన్నారు. 17, 1088 సర్వే నంబర్లలోని భూమి కోర్టు పరిధిలో ఉందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారని, కానీ ఆ సర్వే నంబర్లలో కొంతమందికి పాసు పుస్తకాలు జారీ చేశారని,  తమకెందుకు ఇవ్వరని తహసీల్దార్ ను నిలదీశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్లే జారీ చేయలేకపోతున్నామని ఎమ్మార్వో వారికి సర్దిచెప్పారు.