మానససరోవర్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన యాత్రికులు

మానససరోవర్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన యాత్రికులు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్  జిల్లా ఆది కైలాస్  రూట్ లో కొండచరియలు విరిగిపడి వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. కైలాస్–మానససరోవర్  మార్గంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కొండచరియలు రోడ్డు మార్గాన్ని పూర్తిగా బ్లాక్  చేయడంతో యాత్రికులతో పాటు స్థానికులు కూడా చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న బార్డర్  రోడ్స్  ఆర్గనైజేషన్  (బీఆర్ఓ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కొండచరియల శిథిలాలను తొలగిస్తూ రోడ్డును క్లియర్  చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానిక జిల్లా యంత్రాంగం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇక ఉత్తరాఖండ్ లోని కుమాన్  ప్రాంతం పితోరాగఢ్  జిల్లాలో సాగే ఆది కైలాస్  యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రలో ఒకటిగా భావిస్తారు. పాంచ్  కైలాస్ లలో రెండో అత్యంత పవిత్రమైన యాత్ర ఇది. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 5,945 మీటర్ల ఎత్తులో ఉంది. వర్షాకాలంలో ఇక్కడ కొండచరియలు 
విరిగిపడడం అత్యంత సాధారణం.