కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. మాలధారులతో కిటకిటలాడిన ఆలయం

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. మాలధారులతో కిటకిటలాడిన ఆలయం
  • ముగిసిన హనుమాన్‌‌‌‌‌‌‌‌ పెద్ద జయంతి ఉత్సవాలు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు కాషాయమయమైంది. జై శ్రీరాం నినాదాలతో మార్మోగింది. మంగళవారం హనుమాన్‌‌‌‌‌‌‌‌ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇరుముడులతో స్వామి వారిని దర్శించుకొని మాల విరమణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా అంతరాలయంలో స్వామివారిని తీరొక్క పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.

భద్రాచలం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఆలయం ముందున్న యాగశాలలో ఉదయం తిరుమంజనం, ద్రవిడ ప్రబంధ పారాయణం, విశేష అభిషేకం, తులసి అర్చన, సహస్ర నాగవల్లి అర్చన, హోమం, మహా పూర్ణాహుతి, స్నపన తిరుమంజనం, ఉయ్యాల సేవ, మంత్రపుష్పం, మహా నివేదనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సాయంత్రం ఆరాధన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం సమర్పణ, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ, మంత్రపుష్పం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఇష్టమైన మంగళవారమే జయంతి రావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 

రద్దీ కారణంగా క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మంగళవారం జరిగిన పూజలతో హనుమాన్‌‌‌‌‌‌‌‌ పెద్ద జయంతి వేడుకలు ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా కొడిమ్యాలకు చెందిన తారక రామ కళానిలయం కళాకారులు ప్రదర్శించిన వీరాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.