పేరుకే పెద్దాస్పత్రులు

పేరుకే పెద్దాస్పత్రులు

పేరుకే పెద్దాస్పత్రులు
అస్తవ్యస్తంగా మారిన సర్కారు వైద్యం
పెద్దపల్లి పెద్దాస్పత్రిలో డాక్టర్ల కొరత
జగిత్యాలతో స్టాఫ్‌‌‌‌ ఉన్నా అందని సేవలు
ఇబ్బందులు పడుతున్న రోగులు

ఈ నెల 25న సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన  కడారి లలిత నెలలు నిండడంతో జగిత్యాల జనరల్ ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం వేచి చూసిన డాక్టర్లు నొప్పులు రాకపోవడంతో ఇంజక్షన్ల ద్వారా నొప్పులు తెప్పించి మరుసటి రోజు డెలివరీ చేశారు. కానీ పుట్టిన శిశువు అప్పటికే చనిపోయాడు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందందని ఆరోపించారు.

‘జగిత్యాల పట్టణానికి చెందిన శృతి అనే గర్భిణి 2021 జూన్ 22న  ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ ఫీవర్‌‌‌‌‌‌‌‌తో చేరింది.ప్లేట్ లెట్స్ కావాలని డాక్టర్లు చెప్పడంతో తెలిసిన వారి సాయంతో అరెంజ్ చేశారు. ఉదయం నుంచి సీరియస్‌‌‌‌గా ఉన్న ఆమెకు ప్లేట్ లెట్స్ ఎక్కించిన డాక్టర్లు.. ఇతర కేసులను చూసుకుని తాపీగా రాత్రి 8.30 కు డెలివరీ చేయగా మగ శిశువు జన్మించాడు. శిశువు అరోగ్యంగా లేడని పిల్లల వార్డుకు రిఫర్ చేశారు. అక్కడ పీడియాట్రిషియన్ అందుబాటులో లేకపోవడంతో బాబు పరిస్థితి సీరియస్‌‌‌‌గా మారింది. బంధులు వేరే ఆస్పత్రికి తరలించాలని కోరినా మాకు అధికారం లేదని సిస్టర్లు చేత్తులేశారు. శ్వాస ఆడక బాధపడుతున్న శిశువును చూస్తూ బంధువుల రోధించిన తీరు అక్కడ అందరినీ కలచివేసింది. రాత్రి 10 గంటల సమయంలో వచ్చిన డాక్టర్ శిశువును కరీంనగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమించిందని గమనించిన బంధువులు జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యింది. తల్లి శృతి ఇంకా హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతోంది.  

జగిత్యాల, వెలుగు :  మెడికల్ కాలేజీ మంజూరుతో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ హాస్పిటల్‌‌‌‌గా అప్ గ్రేడ్ అయింది. కానీ రోగులకు మాత్రం మెరుగైన వైద్య సేవలందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 24 గంటలు సేవలందించాల్సిన డాక్టర్లు అందుబాటులో లేక రోగులకు నరకం చూస్తున్నారు. ఇక్కడ పని చేసే డాక్టర్లలో ఎక్కువ మంది ప్రైవేట్ క్లినిక్‌‌‌‌లు నడుపుతున్నారు. దీంతో ఇక్కడ సరిగా సేవలందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓపీ చూసే డాక్టర్లు సైతం 11 గంటలకు వచ్చి 12 గంటల వరకు వెళ్లిపోతున్నట్లు రోగులు చెబుతున్నారు.

మెడికల్ కాలేజ్ పర్మిషన్లు కష్టమే..
డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ నిర్లక్ష్యంతో బాలింతలు,  శిశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదు అందినా ఉన్నతాధికారులు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.  అయితే మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో పర్మిషన్లు రావాలంటే 300 పైగా ఇన్ పేషెంట్లకు నిత్యం సేవలందించాలనే రూల్ ఉంది. కానీ ఆస్పత్రిలో రోజు 100 అవుట్‌‌‌‌, 50కి పైగా పేషెంట్లు ఉంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే మంజూరైన మెడికల్ కాలేజ్ రద్దయ్యే అవకాశం ఉందని హెల్త్ ఆఫీసర్లు ఆందోళనకు చెందుతున్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యం లేదు..
ప్రభుత్వం నార్మల్ డెలివరీలను ఎంకరేజ్ చేయాలని సూచించింది. అవకాశం ఉన్న వారికే ప్రియార్టీ ఇస్తున్నాం. తల్లి, బిడ్డకు ఇబ్బంది ఉంటే సిజేరియన్ చేస్తున్నాం. మంగళవారం జరిగిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదు.
– డాక్టర్ రాములు,  సూపరింటెండెంట్‌‌‌‌, జగిత్యాల హాస్పిటల్ 

 నిలువ నీడ లేదు.. కూర్చోడానికి కుర్చీలు లేవు
మెట్‌‌‌‌పల్లి సివిల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్ కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలకు మధ్యలో ఉన్న ఈ హాస్పిటల్‌‌‌‌లో నిత్యం300లకు పైగా ఓపీ ఉంటుంది. నెలకు 200పైగా డెలివరీలు జరుగుతాయి. కానీ పేషెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆఫీసర్లు, లీడర్లు విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. బుధవారం దవాఖానాకు వచ్చిన గర్భిణులు, రోగులు నిలువ నీడ లేక పోవడం, కూర్చోడానికి కుర్చీలు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   - మెట్‌‌‌‌పల్లి, వెలుగు

పెద్దపల్లిలో ఒక్కరే  గైనకాలజిస్టు
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిని డాక్టర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా జాయిన్ అవుతున్న వారు అనుభవంలేక సరైన వైద్యం అందించడం లేదు. జిల్లా ఆస్పపత్రిలో ఐదుగురు గైనకాలజిస్టుల అవసరం ఉంది. కానీ ఇక్కడ  ఒక్కరే ఉన్నారు. నెల నెలా చెక్ అప్ కోసం వచ్చే గర్భిణిలకు స్టాఫ్‌‌‌‌ నర్సులే పరీక్షలు చేసి పంపిస్తున్నారు. కొంత మంది సీనియర్ డాక్టర్లు ఉన్నప్పటికీ వారికి పెద్దపల్లిలో సొంత హాస్పిటళ్లు ఉండడంతో వాటిపైనే ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది.  

అనుభవం లేనోళ్లు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు
వారం కింద నా భార్యను డెలివరీ కోసం పెద్దపల్లి హాస్పిటల్‌‌‌‌కు తీసుకొచ్చిన. అనుభవం లేని డాక్టర్లు ఆమెకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు. శిశువు బరువు ఎక్కువగా ఉన్నాడు. ఆపరేషన్ చేయాలని మేం చెప్పినా పట్టించుకోకుండా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. నా కొడుకు పురిట్లోనే చనిపోయిండు. దీనిపై సూపరింటెండెంట్‌‌‌‌కు కంప్లైంట్ ఇచ్చినం. 
- కొండిల్ల రాజకుమార్, శివువు తండ్రి, కాల్వ శ్రీరాంపూర్