
- దగ్గరుండి పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులు
- పెరుగుతున్న ఆత్మహత్యల నేపథ్యంలో నిర్ణయం
కోటా(రాజస్థాన్): కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ హబ్‌గా పేరున్న రాజస్థాన్‌లోని కోటాలో స్టూడెంట్ల ఆత్మహత్యలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నవాళ్లలో కొందరు ఒత్తిడిని తట్టుకోలేక, మరికొందరు టార్గెట్ రీచ్ కామేమో అనే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో చాలామంది పేరెంట్స్ కోటాకు షిఫ్ట్ అవుతున్నారు. పిల్లలను హాస్టళ్లలో ఉంచేందుకు బదులు వాళ్లతోనే కలిసి ఉండేందుకు సిద్ధపడుతున్నారు. స్టూడెంట్లలో ఆందోళన తగ్గించేందుకు కొందరు తల్లిదండ్రులు వీకెండ్స్, సెలవు రోజుల్లో కోటాకు వచ్చివెళ్తున్నారు.
ఈ ఏడాదిలో 22 ఆత్మహత్యలు..
ఇంజనీరింగ్ కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ), మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ -కమ్ -ఎంట్రన్స్ టెస్ట్(నీట్) వంటి పోటీ పరీక్షల కోచింగ్ కోసం ఏటా రెండున్నర లక్షల మందికిపైనే స్టూడెంట్లు కోటా వస్తున్నారు. వీళ్లలో ఎక్కువమంది పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. తల్లిదండ్రులకు భారం కాకూడదని, టార్గెట్ సాధించలేమనే భయాందోళన, ఒత్తిడితో కొందరు అభ్యర్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కిందటేడాది 15 మంది విద్యార్థులు, ఈ ఏడాది ఇప్పటికే 22 మంది సూసైడ్ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను హాస్టళ్లలో ఉంచేందుకు వెనుకాడుతున్నారు. ఇల్లు అద్దెకు తీసుకుని వాళ్లుకూడా పిల్లలతో కలిసి ఉంటున్నారు. తన కొడుకు జేఈఈకి, కూతురు నీట్‌కు ప్రిపేర్ అవుతోందని, వాళ్లకోసం తానుకూడా కోటాలో ఉంటున్నానని బీహార్‌లోని జహనాబాద్‌కు చెందిన షింపి చెప్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన సంధ్యా ద్వివేది కూడా తన కొడుకుతో కలిసి కోటాలో ఉంటున్నారు. ‘‘నా కొడుకు జేఈఈ క్రాక్ చేయాలని చదవుతున్నాడు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి మేము వింటున్నం. అందుకే వాడితో పాటు రూమ్ రెంట్‌కు తీస్కుని ఉంటున్నా” అని సంధ్యా ద్వివేది వెల్లడించారు.