లతా స్మారక చిహ్నంపై వివాదం

లతా స్మారక చిహ్నంపై వివాదం
  • రాజకీయం చేయకండి : లతా సోదరుడు హ్రుదయనాథ్ మంగేష్కర్
  • శివాజీ పార్క్ గొప్ప గొప్ప క్రీడాకారులను అందించింది : ప్రకాశ్ అంబేద్కర్

ముంబయి: ఇటీవల మృతి చెందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పేరు మీద ముంబైలోని శివాజీ పార్క్‌లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలంటూ  బీజేపి డిమాండ్ చేసిన నేపథ్యంలో... అధికార శివసేన-కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ డిమాండ్ వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. లతా మంగేష్కర్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలంటూ బీజేపి ఎమ్మెల్యే రామ్ కదమ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. మొదట మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా ఈ డిమాండ్‌కు మద్దతు పలికారు. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు. మహా వికాస్ అఘాడి కూటమిలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ఈ వివాదంపై స్పందించారు. లతా సోదరుడు హృదయనాథ్  మంగేష్కర్ మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ స్మారక చిహ్యం ఏర్పాటు చేయాలని తమ కుటుంబం నుంచి ఎవరు కూడా  ప్రభుత్వాన్ని  అడగలేదన్నారు. దయచేసి ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని, ఇంతటితో ఈ వివాదాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. 

అయితే శివాజీ పార్క్‌లో లతా స్మారక చిహ్నం ఏర్పాటుకు అధికార పార్టీ శివసేన ఇష్టంగా లేదు. దీనికి గల ప్రధాన కారణం.. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాక్రేకు శివాజీ పార్క్ తో విడదీయరాని బంధం ఉంది. బాల్ థాక్రే గతంలో ఈ పార్క్ లో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని ఆయన వారసుడు ఉద్ధవ్ థాక్రే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ పార్క్ లో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే .. ఎన్నో ఏళ్లుగా వస్తున్న తమ సంప్రదాయానికి బ్రేక్ పడుతుందనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని కలీనాలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో లతా మంగేష్కర్‌కు నివాళిగా అంతర్జాతీయ స్థాయి సంగీత అకాడమీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 1,200 కోట్లతో ఈ అకాడమీని నిర్మించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం లతా కుటంబ సభ్యులకు తెలియజేయగా..లతా దీదీకి సంగీత అకాడమీ అత్యుత్తమ నివాళి అంటూ ఆమె సోదరుడు హ్రుదయనాథ్ ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించాడు. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ పార్క్‌ను ఆక్రమణల నుంచి రక్షించడానికి దాదర్ వాసులు చాలా కాలంగా పోరాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాల కోసం శివాజీ పార్క్‌ను బలి చేయవద్దని కోరారు. వంచిత్ బహుజన్ అఘాడి చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ స్మారక చిహ్నం ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తనలాగే ఎంతో మంది బాల్యం ఈ పార్క్ లోనే గడిచిందని, గొప్ప గొప్ప క్రికెట్ క్రీడాకారులను ఈ పార్క్  దేశానికి అందించిదన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను

యాప్‌లు ఇచ్చే లోన్లపై త్వరలో గైడ్‌లైన్స్‌