ఇక ఆన్‌లైన్‌ లోనే వాహనాల రిజిస్ట్రేషన్..కొత్త పోర్టల్‌తో అరచేతిలోనే 52 రకాల ఆర్టీఏ సేవలు

ఇక ఆన్‌లైన్‌ లోనే వాహనాల రిజిస్ట్రేషన్..కొత్త పోర్టల్‌తో అరచేతిలోనే 52 రకాల ఆర్టీఏ సేవలు
  • మార్చి 23 నుంచి అందుబాటులోకి ‘వాహన్’ పోర్టల్
  • 23న ప్రారంభించనున్న మంత్రి పొన్నం
  •  

హైదరాబాద్​సిటీ,వెలుగు: రాష్ట్ర రవాణా శాఖ (ఆర్టీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సుల కోసం అందుబాటులోకి తెచ్చిన ‘సారథి’ తరహాలోనే.. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ‘వాహన్’ పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఈ నెల 23వ తేదీన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా  వాహన్ పోర్టల్‌ సేవలు ప్రారంభం కానున్నాయి.

మొదటి దశలో కేవలం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆన్‌లైన్ చేయనున్నారు. దశలవారీగా మిగితా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త సాంకేతికతపై ఆర్టీఏ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్ డీలర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫీగా సేవలు అందించేలా వారికి నైపుణ్యాన్ని పెంపొందించారు.

ఇకపై ప్రతి కొత్త వెహికల్ ‘వాహన్’ పోర్టల్‌లో నమోదైన తర్వాతే వినియోగదారుడికి అందుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా దళారుల బెడద తప్పడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుందని చెప్పారు. మొదట షోరూమ్​లలో రిజిస్ట్రేషన్​లు ప్రారంభించి అనంతరం వాహన్​లోకి వివరాలను అప్​లోడ్​ చేస్తారని తెలిపారు. వాహన్​ పోర్టల్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వాహన దారులు కేవలం లెర్నింగ్​లైసెన్స్​, వాహనాల ఫిట్​నెస్​ పరీక్షలకు మాత్రమే ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని రకాల సేవలు పూర్తిగా ఆన్​లైన్​ ద్వారానే కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. 

దేశంలోని ఏ ప్రాంతాలకైనా బదిలీ..

వాహన్​ పోర్టల్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వాహనదారులు 52 రకాల సేవలను ఆన్​లైన్​ ద్వారానే పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్​లతో పాటు అమ్మినా, కొన్న తర్వాత  ఓనర్​షిప్​ బదిలీ ఆన్​లైన్​ ద్వారానే నిర్వహించుకోవచ్చు. అలాగే, అంతర్రాష్ట్ర, జిల్లాలకు చెందిన వాహనాల బదిలీలకు సంబంధించి కూడా వాహనదారులు ఇక నుంచి ఎలాంటి ఎన్​ఓసీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఆటోమేటిక్​గా ఆన్​లైన్​లోనే బిదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. బండి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ సదుపాయం లభిస్తుంది. వాహనాలు చోరీకి గురైనా, రోడ్డు ప్రమాదాలు వంటివి జరిగినా కూడా ఆచూకీ కనిపెట్టేందుకు కూడా వాహన్​ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వాహనాల రెన్యూవల్స్​, డుప్లికేట్ ​లైసెన్సులు తీసుకోవడం, అడ్రెస్​ మార్పులు, వాహనాల బదిలీలు, పర్మిట్లు, ఫీజుల చెల్లింపులు కూడా వాహన ద్వారానే నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు వివరించారు.

అన్ని రకాల సేవలను ఆన్​లైన్​ ద్వారా అందించడం వల్ల ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద చాలా వరకూ నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి అవసరానికి ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లే పని కూడా తగ్గిపోతుందని అధికారులు పేర్కొన్నారు.