మాస్కో: భారత్‌తో సహా తమ మిత్ర దేశాలన్నింటిపైనా అమెరికా అన్యాయంగా ఆంక్షలు విధిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ముఖ్యంగా ఇండియాతో మాస్కో సంబంధాలను నియంత్రించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. తమ చమురును కొనవద్దంటూ ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తోందని తెలిపారు. ప్రపంచ ఇంధన మార్కెట్లను, సరఫరా మార్గాలను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుని ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా అమెరికా పనిచేస్తున్నదని విమర్శించారు.
సోమవారం డిప్లొమాటిక్ వర్కర్స్ డే సందర్భంగా రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రష్యాతో దౌత్య సంబంధాలకు దూరంగా ఉండాలని భారత్, చైనా, బ్రెజిల్ వంటి బ్రిక్స్ దేశాలపై అమెరికా ఒత్తిడి చేస్తున్నది. రష్యా వాణిజ్యం, పెట్టుబడులు, సైనిక -సాంకేతిక సహకారాన్ని నియంత్రించాలని యూఎస్ ప్రయత్నిస్తున్నది. రష్యన్ చమురు కొనుగోలు చేయకుండా మిత్ర దేశాలను అడ్డుకుంటున్నది" అని అన్నారు.
