
వాషింగ్టన్: ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను జనం నమ్మే పరిస్థితి లేదని, ఆయనకు దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని, ప్రెసిడెంట్ పదవి నుంచి ట్రంప్‌ను తొలగించాలని లీడ్ హౌస్ ఇంపీచ్మెంట్ మేనేజర్, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ హెడ్ ఆడమ్ షిఫ్ సెనెట్‌ను కోరారు. ‘‘అమెరికా ప్రజలకు తమ గురించి పట్టించుకునే.. తమ ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే ప్రెసిడెంట్ కావాలి. ఇప్పుడున్న ప్రెసిడెంట్‌ను మనం నమ్మలేం. దేశానికి ఏది మంచి చేస్తుందో అది ఆయన చెయ్యరు. ట్రంప్‌కు ఏది మంచి చెస్తుందో దానినే నమ్ముతారు. ఇదే పనిని ఇప్పుడు చేస్తున్నారు. గతంలోనూ చేశారు. రాబోయే రోజుల్లోనూ చేస్తారు. ఆయన తప్పు చేసినట్టు తేలితే.. పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే నిజమే ముఖ్యమైనది. అది లేకపోతే మనం అన్నీ కోల్పోయినట్టే”అని చెప్పారు. 2020లో మళ్లీ తాను ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో గెలిచేందుకు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలపై ప్రవేశపెట్టిన ఇంపీచ్మెంట్ట్రయల్లో డెమొక్రాట్లు సెనెట్‌లో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ట్రంప్ తన అధికారాలను దుర్వినియోగం చేసినట్టుగా నిరూపించేందుకు అనేక వీడియోలు, ఇంటర్నల్ డాక్యుమెంట్లు, సాక్షుల స్టేట్మెంట్లను హౌస్ ఇంపీచ్మెంట్ మేనేజర్లు సభలో పెట్టారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉన్న మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిసెన్‌ను దెబ్బ తీసేందుకు సహకరించాలని గత ఏడాది ఉక్రెయిన్నేతలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు షిఫ్ ప్రాసిక్యూషన్ టీమ్ సెనెట్‌కు వివరించింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం ఓ విదేశాన్ని మన ఎన్నికల్లో కలుగజేసుకునేలా ట్రంప్ తన అధికారాలను ఉపయోగించారని హౌస్ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ జెర్రీ నాడ్లర్.. చాంబర్‌కు వివరించారు. 9 గంటల పాటు జరిగిన ఈ వాదనల్లో ట్రంప్ ఎటువంటి తప్పు చేయలేదన్న రిపబ్లికన్ల వాదనకు డెమొక్రాట్లు పూర్తి ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు. గత ఏడాది జులైలో ఉక్రెయిన్‌కు ఫండ్స్ ను రహస్యంగా నిలుపుదల చేయడం వెనుక ట్రంప్ ఉద్దేశం ఒకటే అని, బిడెన్‌పై విచారణకు ఆదేశించేలా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జలెన్స్కీపై ఒత్తిడి తేవడమే అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక నిర్దిష్టమైన నేరం ఉంటేనే ప్రెసిడెంట్‌ను తొలగించగలమన్న వైట్‌హౌస్ వాదనలో పస లేదని డెమొక్రాట్లు స్పష్టం చేశారు. అమెరికా ఇంటెలిజెన్స్, డిప్లమాటిక్ చీఫ్‌ల కంటే కూడా ట్రంప్ తన పర్సనల్ లాయర్ రూడీ గులియానీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, జెలెన్స్కీపై ఒత్తిడి తేవడంలో అతడిదే కీలక పాత్రని, ఈ దేశానికే ఆయన ప్రమాదకారి అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని షిఫ్ అన్నారు. అయితే మేనేజర్లు చెప్పిన విషయంలో కొత్తదనంలేదని రిపబ్లికన్ సెనెటర్ జాన్ బర్రాసో, ట్రంప్ అటార్నీ జే సెకూలోవ్ చెప్పారు. వాస్తవాలు సభ ముందు పెట్టి డెమొక్రాట్లు చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపిస్తామన్నారు. మరోవైపు ఈ ప్రాసెస్‌పై స్పందిస్తూ అన్నీ అబద్ధాలు, తప్పుడు ప్రకటనలే అని ట్రంప్ ట్విట్టర్లో మండిపడ్డారు.