ప్రజలని మభ్య పెట్టకండి

ప్రజలని మభ్య పెట్టకండి

ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర పథకాలను టీఆర్ఎస్ అమలు చేస్తూ సొమ్ము ఒకరిది, సోకు టీఆర్ఎస్ ది అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ ఇటీవల చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు Dr. లక్ష్మణ్ గారు? అంటూ కౌంటర్ విసిరారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నదన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పడుతున్నందుకు థాంక్స్ చెప్పండి అంటూ సలహా ఇచ్చారు. లెక్కలు తెలుసుకొమ్మని, ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి- అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకాలతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నట్టు లక్ష్మణ్ ఆరోపించారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు.