
- మేనిఫెస్టోలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నయ్
- పోటీపడి వేలం పాటలా ప్రకటించాయని విమర్శ
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్.. అనే నినాదంతో రూపొందించామని ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పనే బీజేపీ విధానమని తెలిపారు. ఇతర పార్టీలు ప్రకటించిన ఫ్రీ స్కీమ్ లు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించేలా ఉన్నాయన్నారు. ప్రజల బతుకులు మార్చే మేనిఫెస్టో ఇవ్వడంలో అన్ని పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు.
సోమవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో లక్ష్మణ్ మాట్లాడారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. అక్కడ ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉచితాలు పోటీపడి వేలం పాటలా ప్రకటించాయన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. తొమ్మిదేండ్లలో ప్రవేశపెట్టిన రూ.30 లక్షల కోట్ల బడ్జెట్ ఎటు పోయిందని ప్రశ్నించారు. లక్షల కోట్ల బడ్జెట్తో ఎవరు బాగుపడ్డారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.
కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ, కేసీఆర్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీ హామీలు ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. బీసీ సీఎం కేవలం బీజేపీతోనే సాధ్యమని, బీసీలంతా బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధం అయ్యారని చెప్పారు. ధరణి రాకముందు భూములకు పట్టాలే లేనట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్వేలను ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు.