నైజీరియన్ గ్యాంగ్​ను అరెస్ట్ చేసిన ఎల్ బీనగర్ పోలీసులు

నైజీరియన్ గ్యాంగ్​ను అరెస్ట్ చేసిన ఎల్ బీనగర్ పోలీసులు
  • నైజీరియన్ గ్యాంగ్​ను అరెస్ట్ చేసిన ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు
  • 38 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైదరాబాద్‌‌,వెలుగు: సిటీ శివార్లలో డ్రగ్స్‌‌ దందా చేస్తున్న నైజీరియన్‌‌‌‌తో పాటు ముగ్గురు డ్రగ్స్ సప్లయర్స్‌‌ను ఎల్‌‌బీనగర్‌‌‌‌ ఎస్‌‌ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.9 లక్షల విలువైన 38 గ్రాముల కొకైన్‌‌, రూ.22 వేల క్యాష్‌‌, 3 బైక్ లు,సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరెడ్ మెట్​లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో సీపీ మహేశ్​భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన  మార్క్ ఒవోలాబి అలియాస్‌‌ జిగ్గీ(41) బిజినెస్ వీసాపై  2012లో ఇండియాకు వచ్చాడు. ముంబయి, ఢిల్లీలోని డ్రగ్స్ సప్లయర్స్‌‌తో నెట్‌‌వర్క్‌‌ పెంచుకున్నాడు. సిటీకి వచ్చిన మార్క్  బంజారాహిల్స్ పరిధి పారామౌంట్‌‌ హిల్స్‌‌లోని ర్యాబ్‌‌ రెసిడెన్సీ లో ఉంటున్నాడు. స్థానికంగా ఉండే నైజీరియన్స్‌‌తో కలిసి డ్రగ్స్‌‌ సప్లయర్​గా మారాడు. ముంబయి,ఢిల్లీ నుంచి కొకైన్‌‌ తీసుకొచ్చి సిటీలో సప్లయ్ చేసేవాడు. గతేడాది గోల్కొండ పోలీసులకు పట్టుబడ్డ మార్క్‌‌ను చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.

గంజాయి గ్యాంగ్‌‌తో కలిసి..
చంచల్‌‌గూడ జైలులో గంజాయి స్మగ్లర్‌‌‌‌ అభిషేక్ సింగ్‌‌తో మార్క్ పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి గంజాయి కస్టమర్లకు డ్రగ్స్‌‌ ను సప్లయ్‌‌ చేసేలా స్కెచ్ చేశారు. ఇందులో భాగంగా నేరేడ్‌‌మెట్‌‌ లో ఉండే చెందిన డిగ్రీ స్టూడెంట్ తోట హర్షవర్ధన్‌‌(23), ప్రైవేటు ఎంప్లాయ్ గునపోగుల స్వామి ప్రసాద్‌‌(23), గుంటూరు జిల్లా పొన్నూరు పమిడివారిపాలెంకు చెందిన దుడ్డు పవన్‌‌ కుమార్‌‌‌‌(21)తో కలిసి అభిషేక్, మార్క్ డ్రగ్స్‌‌ సప్లయ్ ప్రారంభించారు. అభిషేక్ సింగ్‌‌ ఇచ్చే ఆర్డర్స్‌‌తో  మార్క్‌‌ కొకైన్ ట్రాన్స్‌‌పోర్ట్ చేసేవాడు. ఒక్కో గ్రాము రూ.10 వేల నుంచి రూ.15 వేలు అమ్మేవారు. అభిషేక్‌‌,మార్క్‌‌పై రాచకొండ పోలీసులు నిఘా పెట్టారు. నేరేడ్‌‌మెట్‌‌ గోకుల్‌‌నగర్‌‌‌‌లో మంగళవారం ఉదయం తనిఖీలు చేశారు. మార్క్‌‌తో పాటు హర్షవర్ధన్‌‌, స్వామిప్రసాద్‌‌, పవన్‌‌కుమార్‌‌‌‌ ను అదుపులోకి తీసుకున్నారు. శివార్లలో డ్రగ్స్, గంజాయి సప్లయ్ చేసేవారిపై నిఘా పెట్టినట్లు సీపీ మహేశ్​భగవత్ తెలిపారు.