
- పెళ్లి చేసుకో అని అడిగినందుకు ఫొటోలు బయటపెడతాననిబ్లాక్ మెయిల్
- యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పొక్సో కేసు నమోదు
ఎల్బీనగర్, వెలుగు: ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడి తన దగ్గర ఉన్న ఫోటోలు ఇతరులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పొక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో ఓ కుటుంబం కూలీ పని చేస్తూ నివసిస్తోంది. వారి కూతురు (17) ఇంటి వద్దే ఉంటోంది. అదే కాలనీలో ఉండే కిలారి నాగార్జున (25) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
నాగార్జున బాలికతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకున్నాడు. బాలిక పెళ్లి చేసుకోమని యువకుని అడగ్గా తనతో కలిసి ఉన్న ఫొటోలు మీ కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడు. బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగార్జునపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పొక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.