పిలిస్తే పెండ్లిళ్లకు.. తెలిస్తే చావులకు..! లీడర్ల తిప్పలు

పిలిస్తే పెండ్లిళ్లకు.. తెలిస్తే చావులకు..! లీడర్ల తిప్పలు

జనాన్ని కలిసేందుకు లీడర్ల పరుగులు

గెలిచినోళ్లవి మళ్లీ గెలవాలని తిప్పలు ​

ప్రజలు మర్చిపోకుండా మాజీల పాట్లు

ఖమ్మంలో పరామర్శలు, పలకరింపుల రాజకీయాలు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనం మర్చిపోకుండా ఉండేందుకు నేతలు  పాట్లు పడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినోళ్లు, ఓడిపోయి మాజీలు అయినోళ్లు ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట, వర్గ పోరు ఉన్న దగ్గర బలం తగ్గకుండా చూసుకునేందుకు, తమ వైపు ఉన్నోళ్లు ఇంకో వర్గం వైపు మారకుండా ఉండేందుకు ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండాలని తపన పడుతున్నారు. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఏదో కారణంతో నియోజకవర్గాలను, జనాలను అంటి పెట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంగేజ్మెంట్లు, పెండ్లి, రిసెప్షన్​, బారసాల, అన్నప్రాసన, బర్త్ డే.. ఇలా ఏ శుభకార్యానికైనా పిలిస్తే చాలు ఠక్కున వాలిపోతున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనే తేడా లేకుండా పిలిచిన ప్రతి ఫంక్షన్​కు వెళ్లి పలకరించి, ఫొటో దిగి వస్తున్నారు. ఏదో కారణంతో ఆ రోజు వెళ్లడానికి వీలు కాకపోతే ఆ తర్వాత గుర్తు పెట్టుకొని మరీ వెళ్లి విషెష్​ చెప్పి వస్తున్నారు. ఎవరైనా చనిపోయారని తెలిస్తే పరామర్శకు వెళ్లి ఫొటోకు దండ వేసి దండం పెట్టి వారి ఫ్యామిలీ మెంబర్స్​ను పరామర్శిస్తున్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పి వచ్చే నేతలు కొందరైతే, పేదవారైతే అంత్యక్రియల ఖర్చులకు డబ్బులిచ్చి ఓదార్చి వచ్చేవారు మరికొందరు.

పొంగులేటి ఇలా…

ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో  కార్యాలకు రెగ్యులర్​గా హాజరవుతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర శుభ కార్యాలకు వెళితే వారికి కొత్త బట్టలు పెట్టడం ఆయన అలవాటుగా పెట్టుకున్నారు. పేదలు ఎవరైనా చనిపోతే, వారి కుటుంబ సభ్యులకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, వైద్య ఖర్చులకు, ఫీజులకు సాయం చేయడం లాంటివి చేస్తున్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా ఫంక్షన్లకు, చావులకు వెళుతున్నారు.

లీడర్ల మధ్య అభిప్రాయ బేధాలు

ఈ టూర్ల విషయంలో లీడర్ల మధ్య అక్కడక్కడా అభిప్రాయ బేధాలు, ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది. అధికార పార్టీలో ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్​చార్జీలుగా కూడా వ్యవహరిస్తుండగా తమకు తెలియకుండా తమ మండలాల్లో ఎలా పర్యటిస్తారంటూ ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి కూడా కంప్లయింట్​ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు జనాలు తమను మర్చిపోకుండా ఉండేం దుకు కొందరు, జనాలను తమ వైపు తిప్పుకునేందుకు మరికొందరు చేస్తున్న ఈ పర్యటనలతో పేదలకు, బాధితులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిలిస్తే పలుకుతాం అంటూ ఊర్లలో రెగ్యులర్​ గా చేస్తున్న పర్యటనలతో కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు తుమ్మల…అటు కందాల

నియోజకవర్గాల వారీగా చూస్తే టీఆర్ఎస్​లో రెండు వర్గాలు బలంగా ఉన్న పాలేరులో అటు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి, ఇటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పరామర్శల విషయంలో ఎమ్మెల్యే కందాల కొత్త సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులు పరామర్శించి ఖర్చుల కోసం రూ.10 వేలు చేతిలో పెడుతున్నారు. రెండేండ్లలో కొన్ని వందల కుటుంబాలకు ఇలా ఆయన సాయమందించారు. గతానికి భిన్నంగా మాజీ మంత్రి తుమ్మల కూడా రెగ్యులర్​గా పాలేరు నియోజకవర్గంలో ఫంక్షన్లకు హాజరవుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ముందు తుమ్మలకు ఇలా పెండ్లిళ్లు, చావులకు అటెండయ్యే అలవాటు లేదని అనుచరులు చెబుతున్నారు. హ్యూమన్ ​రిలేషన్స్ ​విషయంలో గతంలో చేసిన పొరపాట్లను తుమ్మల ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థాయిలో కాకున్నా, వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్​, మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​ రాజ్, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ కూడా ఇలాగే ఫంక్షన్లకు అటెండవుతున్నారు.

For More News..

ఇసుక అక్రమ రవాణాకు పంచాయతీ ట్రాక్టర్లు.. ట్రిప్పుకు రూ.4 వేలు

రెడ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇయ్యాలె

16 నుంచి వ్యాక్సినేషన్.. జిల్లాకు మూడు సెంటర్లు