- మంత్రులు పొంగులేటి, సీతక్క సమక్షంలో వందలాది మంది చేరిక
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వందలాది మంది బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో రహమత్‌నగర్‌కు చెందిన సుమారు 400 మంది ఇతర పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ పొంగులేటి స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అభివృద్ధిని కోరుకుని సిద్ధాంతాలను, మనస్పర్ధలను పక్కనపెట్టి ఇంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, చైర్మన్లు మల్ రెడ్డి రామ్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బోరబండ డివిజన్బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సిరాజ్జుద్దీన్ 200 మంది కార్యకర్తలతో కలిసి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బోరబండ డివిజన్లో మహమ్మద్ సిరాజ్ రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యిందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేసి అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి, బండ్రు శోభారాణి, హబీబా సుల్తానా పాల్గొన్నారు.
సీఎం సమక్షంలో బీజేపీ నేత
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కూకట్ పల్లి కాంగ్రెస్ నేత బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
