లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్.. IAS, IPS లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్‌‌‌‌ఎస్..

లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్.. IAS, IPS లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్‌‌‌‌ఎస్..
  • వివిధ కేసులు, ఆందోళనలు, ప్రొటోకాల్ ​అంశాల్లో నోరు జారుతున్న నేతలు
  • మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీశ్​ తదితరుల బెదిరింపులు
  • విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు
  • వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూహెచ్చరికలు
  • రాజకీయ, అధికారవర్గాల్లో తీవ్ర చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్​ నేతలు..  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా తీవ్రస్థాయిలో  విరుచుకుపడ్తున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ల పేర్లన్నీ తమ వద్ద ఉన్న పింక్​బుక్‌‌లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతుచూస్తామంటూ బహిరంగంగానే  హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కేవలం వృత్తిపరమైన ఆరోపణలకే పరిమితం కాకుండా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్​రేస్​, ఫోన్​ట్యాపింగ్​తదితర కేసుల్లో పీకల్లోతు మునిగిన కేసీఆర్​, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావులాంటి పెద్దలీడర్లు.. కొన్నాళ్లుగా తమ ఫ్రస్ట్రేషన్‌‌‌‌ను ఐఏఎస్​, ఐపీఎస్‌‌‌‌లపై చూపిస్తుండగా,  ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రొటోకాల్​ ఇష్యూస్​ పేరుతో కట్టుతప్పుతున్నారు. తాజాగా.. బీఆర్ఎస్​ హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి.. కరీంనగర్​ సీపీని మతం పేరుతో దూషించడం ఇందుకు పరాకాష్టగా నిలిచింది.  

కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా అధికారులను దూషించడంలో పోటీపడ్తున్నారు. కాగా, నేతల తీరు శ్రుతి మించుతుండడంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌‌‌‌గా తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని, ఎవరినో పనిగట్టుకొని సంతృప్తిపరచాల్సిన అవసరం తమకు లేదని  స్పష్టంచేస్తున్నారు. ఆయా నేతల రాజకీయ ప్రయోజనాల కోసం తమ విధుల్లో జోక్యం చేసుకున్నా,  తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఊరుకునే ప్రసక్తి లేదంటూ తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

అధికారులపై బెదిరింపు ధోరణి.. 

సివిల్​ సర్వెంట్లతోపాటు ఇతర ప్రభుత్వ అధికారులను బెదిరించే ధోరణి గతంలో ఏపీలో ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ తరహా వైఖరి పెరిగింది. ముఖ్యంగా వివిధ కేసుల్లో ఇరుక్కున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావు తదితరులు తరుచూ ఐఏఎస్​, ఐపీఎస్‌‌‌‌లపై నోరుజారుతున్నారు. పైగా ఆ కామెంట్స్‌‌‌‌ను బీఆర్ఎస్​ నేతలు సోషల్​ మీడియాలో వైరల్ చేస్తూ అధికారులను  రెచ్చగొడ్తున్నారు. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య ప్రొటోకాల్​ఇష్యూస్​ వస్తుంటాయి.  

గత బీఆర్ఎస్​హయాంలో కాంగ్రెస్​, బీజేపీ నేతలకు ఇలాంటి ఇష్యూస్​వచ్చినప్పుడు చిన్నచిన్న వాగ్వాదాలు, సీఎస్‌‌‌‌కు, స్పీకర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదులు చేయడం వరకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్​మారింది.  కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్​రేస్​, ఫోన్​ట్యాపింగ్​తదితర కేసుల్లో బీఆర్ఎస్​ ముఖ్య నేతలు ఇరుక్కున్నారు. దీంతో ఆయా కేసులు, వాటి దర్యాప్తు, విచారణ సందర్భాల్లో పోలీస్, ఇతర​ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని  వారు విరుచుకుపడ్తున్నారు.

 అధికారులు చేసే చిన్నచిన్న పొరపాట్లను ఎత్తిచూపుతూ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, తాము మూడేండ్లలో అధికారంలోకి వచ్చాక​అందరి లెక్కలు తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన కార్యక్రమాల సందర్భంగా, ముఖ్యంగా ర్యాలీలు, రాస్తారోకోలకు అనుమతులు ఇవ్వకపోయినా, నోటీసులు జారీ చేసినా.. నేతలు నోటికి పనిచెప్తున్నారు. ఆయా అధికారుల పేర్లను డైరీల్లో రాసుకుంటున్నామని,  ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అధికారుల గత రికార్డులను  పరిశీలిస్తామని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. 

ఈ విధమైన బెదిరింపులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడమేనని, కొందరు అధికారులైతే మానసికంగా కుంగిపోతున్నారని సెక్రటేరియెట్‌‌‌‌ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అధికార మార్పిడి జరిగిన ప్రతిసారీ ఇలాంటి వ్యాఖ్యలు సహజమే అయినా, ఈసారి  తీవ్రత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

అధికారులపై  నేతల హెచ్చరికలు..

మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే మూడేండ్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్​ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు రేవంత్‌‌‌‌కు చెంచాలుగా పనిచేస్తున్న పోలీస్​ అధికారులు, ఐఏఎస్‌‌‌‌ల లెక్క తేలుస్తామని వార్నింగ్‌‌‌‌ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పినట్టు విని బీఆర్ఎస్​ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాళ్లందరి పేర్లనూ బుక్కుల్లో రాసి పెట్టుకోవాలని కేడర్‌‌‌‌‌‌‌‌కు చెప్పారు.  ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ , ఫార్ములా ఈ రేస్​ విచారణల సమయంలో అధికారులను బెదిరించేలా ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఫైళ్లపై సంతకాలు చేస్తే భవిష్యత్తులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని అధికారులను కేటీఆర్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు.  

మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు కూడా అధికారులపై తరుచూ నోరుపారేసుకుంటున్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో విచారణ తర్వాత మాట్లాడుతూ.. ‘‘సజ్జనార్ .. చట్టం అందరికీ సమానమే. మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే, రేపు కాలం మారుతుంది. అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది”అంటూ హెచ్చరించారు. అంతకుముందు కూడా  బీఆర్‌‌‌‌ఎస్ నాయకులపై  కేసులు నమోదు చేయడం, జర్నలిస్టుల అరెస్టుల నేపథ్యంలో హరీశ్‌‌‌‌ మాట్లాడుతూ.. ‘‘మీరు చెప్పిన ఖాకీ బుక్ ఏమైంది? దానిని కాకి ఎత్తుకెళ్లిందా?’’ అని డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఉద్దేశించి చులకనగా మాట్లాడారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. 

    ఫోన్ ట్యాపింగ్​ కేసులో విచారణపై ఏసీపీకి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్​ రాసిన లేఖ సైతం బెదిరింపు ధోరణిలోనే ఉందని అధికారులు పేర్కొంటున్నారు.  నందినగర్‌‌‌‌‌‌‌‌లోని కేసీఆర్​ఇంటికి నోటీసులు అంటించడాన్ని తప్పుపడ్తూ సిట్​ఏసీపీ వెంకట్‌‌‌‌రెడ్డికి ఆరు పేజీల లేఖ రాశారు.  ఓ మాజీ సీఎం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని,  తన రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ఫైర్​అయ్యారు. ‘‘పోలీసులు చట్టాలను, సుప్రీం కోర్టు తీర్పులను అతిక్రమించి నాకు నోటీసులు ఇచ్చారు..  భవిష్యత్​ నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ  దాన్ని విస్మరించారు..65 ఏండ్లు పైబడినవారిని తాము కోరుకున్న చోటే విచారించాల్సి ఉన్నప్పటికీ కావాలని నందినగర్‌‌‌‌‌‌‌‌లోని ఇంటికి నోటీసులు అంటించారు..  అసలు సిట్ అధికారులకు నోటీసు ఇచ్చే అధికారమే లేదు..  ఇది నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే’’ అంటూ హెచ్చరించారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి తరుచూ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.  కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం లక్ష్యంగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వీణవంక సమ్మక్క జాతరకు వెళ్తున్న తనను అడ్డుకున్నారన్న కోపంతో  కౌశిక్‌‌‌‌రెడ్డి.. సీపీ మతాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలాంటి నేతలు కూడా దీనిని ‘ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగం’గా అభివర్ణించడంతో ఇష్యూ మరింత తీవ్రమైంది.  

గతంలోనూ అధికారుల కాలర్ పట్టుకుంటామని, తమ జోలికి వస్తే ఊరుకోబోమని  కౌశిక్‌‌‌‌రెడ్డి హెచ్చ రించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో గొడవ  నేపథ్యంలో, కౌశిక్‌‌‌‌రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తనను అడ్డుకున్న మాదాపూర్ పోలీసు అధికారులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఖాకీ చొక్కా తీసేసి వస్తే మీ సంగతి చూస్తా’’ అంటూ మాట్లాడారు.  

    ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్‌‌‌‌ను పర్యవేక్షిస్తున్న సజ్జనార్‌‌‌‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని బీఆర్‌‌‌‌ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్  అన్నారు. సజ్జనార్‌‌‌‌‌‌‌‌పై గతంలో (2015 నాటి ‘ఓటుకు నోటు’ కేసు సమయంలో) ఏపీలో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. దీనిపై సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించి 48 గంటల్లోగా ఆధారాలు సమర్పించాలంటూ ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఆధారాలు చూపలేకపోతే సివిల్,   క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన ప్రవీణ్ కుమార్ , తాను వ్యక్తిగత దూషణలు చేయలేదని, కేవలం తన దగ్గర ఉన్న సమాచారం మేరకే ప్రశ్నించానని బదులిచ్చారు.

    అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడం, వారు వినకపోవడంతో దూషించడంతోపాటు ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ చేయిస్తామంటూ బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మానకొండూర్​ కాంగ్రెస్​ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఓ ఇసుక క్వారీ విషయంలో కరీంనగర్​ సీపీని దూషించినట్లు తెలిసింది. అక్కడ అక్రమాలకు పాల్ప డుతున్న ఓ ఎస్సైపై చర్యలు తీసుకోకుండా ఒత్తిడి చేయడంతో  మనస్తాపం చెందిన సీపీ కొద్దిరోజులు సెలవులో వెళ్లినట్లు చర్చ జరిగింది. ఔట్‌ సోర్సింగ్​ ఉద్యోగాల టెండర్​​ కోసం కావాల్సిన సమాచారం ఇవ్వడంలేదని గద్వాల జిల్లా ఎంప్లాయింట్​ఆఫీసర్‌‌ను ఆలంపూర్​ మాజీ ఎమ్మెల్యే సంపత్ దూషించిన ఆడియో అప్పట్లో కలకలం రేపింది.

ధీటుగా స్పందిస్తున్న ఉన్నతాధికారులు.. 

రాజకీయ నేతల విమర్శలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు సైతం  ధీటుగా స్పందిస్తున్నాయి. తమ తప్పులను ఎత్తిచూపితే తప్పులేదని, కానీ ఆ పేరుతో తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకున్నా, తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాల్సి ఉంటుందని, కానీ విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. 

కొందరు అధికారులు సోషల్ మీడియా వేదికగా తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టేదాకా పరిస్థితి వచ్చింది. విధి నిర్వహ ణలో భాగంగా తాము తీసుకునే చర్యలను రాజకీయ కోణంలో చూడవద్దని సూచిస్తున్నారు. రాజకీయ విమర్శ లస్థాయి పెరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఐఏఎస్ , ఐపీఎస్​ అధికారుల సంఘం ఇప్పటికే హెచ్చరించింది. అధికారుల  ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను వ్యవస్థాగతంగా తిప్పికొడతామని స్పష్టంచేసింది. ఇటీవల ఒక మంత్రి, మహిళా ఐఏఎస్​ అధికారుల విషయంలో ఐఏఎస్‌‌‌‌ల సంఘం ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి వ్యవహారంలో ఐఏఎస్​, ఐపీఎస్​ సంఘాలు ఏకతాటికి వచ్చి క్షమాపణాలు చెప్పాలని డిమాండ్​ చేయడంతో ఆయన దిగిరాక తప్పలేదు. 


ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధుల కామెంట్స్​:

ప్రతి అధికారి పేరును డైరీలో రాసి పెడుతున్నాం, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 
- కేటీఆర్

సజ్జనార్ .. చట్టం అందరికీ సమానమే. మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే, రేపు కాలం మారుతుంది. అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.  - హరీశ్​రావు

ఖాకీ చొక్కా తీసేసి వస్తే మీ సంగతి చూస్తా. - కౌశిక్​రెడ్డి