ప్రముఖ వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్య

ప్రముఖ వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్య
  • వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసుతో సంబంధాలున్నాయన్న పుకార్లే కారణం..?

మెదక్:  జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆర్. చంద్రశేఖర్ ఆత్మహత్య కు పాల్పడ్డారు. హైదరాబాద్ లో ఒక హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత నెలలో ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో ఈ డాక్టర్ కు సంబంధాలున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ ఆదివారం ఆయన హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్ లో అనురాధ నర్సింగ్ హోమ్ పేరులో ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నాడు. తన‌ భార్యతో కలిసి గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. గత ఆగస్టు నెలలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపణలు చేశారు.

ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండటంతో ఈ రోజు చంద్రశేఖర్ తన భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన తరువాత అతని భార్య అత్యవసర ఆపరేషన్ ఉందని మెదక్ ఆస్పత్రికి తిరిగి వెళ్లగా చంద్రశేఖర్ కె.పి.హెచ్.బి కాలనీలోని సితార్ గ్రాండ్ హోటలులో రూం నం.314లో దిగారు. గదిలోకి వెళ్లిన‌ డాక్టర్ ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటలుకు చేరుకొని గది తలుపులు తెరిచి చూడగా చంద్రశేఖర్ ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమా.. లేక ఏదైనా ఒత్తిళ్లు పనిచేశాయా అన్నది పోస్టుమార్టం అనంతరం విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.