బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్.. స్పందించిన పొలిటీషియన్స్

బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్.. స్పందించిన పొలిటీషియన్స్

కూనూర్: త్రివిధ దళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూర్ లో చోటు చేసుకున్ ఈ ప్రమాదంలో.. హెలికాప్టర్ లోని 14 మందిలో 11 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో రావత్ భార్య మధులిక కూడా ఉన్నట్లు సమాచారం. అయితే రావత్ కు తీవ్ర గాయాలయ్యాయని.. ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రముఖ రాజకీయ నేతలు స్పందించారు. బిపిన్ రావత్ త్వరగా కోలుకోవాలని, ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ నాయకులు ట్వీట్ చేశారు. రావత్ గురించి ట్వీట్ చేసిన వారిలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తోపాటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 

‘సీడీఎస్ బిపిన్ రావత్ తోపాటు ఆయన భార్య, ఛాపర్ లో ఉన్న మిగిలిన అధికారులు సురక్షితంగా మన ముందుకొస్తారని ఆశిస్తున్నా. వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

‘కూనుర్ ప్రమాద వార్త విషాదకరం. బిపిన్ రావత్ తోపాటు ఆయన కుటుంబీకులు, ఇతర అధికారులు సేఫ్ గా బయటపడాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని దీదీ అన్నారు. 

బిపిన్ రావత్ ప్రమాద వార్త తనను షాక్ కు గురి చేసిందని స్టాలిన్ ట్వీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనాల్సిందిగా స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించానని, తాను కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తున్నట్లు స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో త్రివిధ దళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్ఎల్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్ కే గురుసేవక్ సింగ్, ఎన్ కే జితేంద్ర, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయి తేజ, హవల్దార్ సత్పాల్ తోపాటు సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తంగా ఆ హెలికాప్టర్ లో 14 మంది ఉన్నారని సమాచారం.