
హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ సురభి (రేకందార్) నాగేశ్వర రావు మృతి రాష్ట్రానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు,పద్మశ్రీ సురభి నాగేశ్వర రావు(76) గురువారం లింగంపల్లి సురభికాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంగీతం, నాటకరంగానికి శతాబ్ధానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సీఎం కేసిఆర్ కొనియాడారు. తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడుగా, నాటక రంగానికి నాగేశ్వర్ రావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదని సీఎం ప్రశంసించారు. సురభి నాటక రంగాన్ని బతికించేందుకు రేకేందర్ నాగేశ్వర్ రావు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2011లో నాగేశ్వర్ రావు సంగీత నాటకఅకాడమీ అవార్డును సైతం అందుకున్నారు. సురభి నాటక సమాజంలో నాగేశ్వర్ రావు బాబ్జీగా ప్రఖ్యాతిగాంచారు.