
టీపీటీఎల్ఎఫ్ వినతి
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి స్కూళ్లు, కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినా కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు సెలవులు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ సంఘం రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్ చెప్పారు. సదరు స్కూళ్లపై చర్యలు తీసుకొని, టీచర్లకు సెలవులు ఇచ్చేలా చూడాలన్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు సంఘం ప్రతినిధులు సైదులు, శ్రీనివాస్, శివప్రచండతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. చాలా స్కూళ్ల యాజమాన్యాలు ఈ నెల 30 వరకు స్కూళ్లకు రమ్మని ఆదేశాలు జారీ చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంచిర్యాల డీఈఓపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేటు స్కూల్ టీచర్లను అవమానించిన మంచిర్యాల డీఈఓపై చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోశ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూళ్లు టీచర్లకు దసరా సెలవులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తే డీఈఓ అసభ్యకరంగా మాట్లాడటం కరెక్ట్‌కాదన్నారు. ‘టీచర్లకు బుద్ధి లేదు.. యూజ్లెస్ ఫెలోస్’ అంటూ మాట్లాడటం దారుణం అన్నారు. వెంటనే డీఈఓ టీచర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.