
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ, కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తున్నాయని లెఫ్ట్ పార్టీల నాయకులు ఆరోపించారు. శ్రీలంక తరహాలో ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రజలపై ధరలు, పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు బీజేపీని వ్యతిరేకిస్తూనే కేంద్ర ప్రభుత్వ పాలసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు. ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మతవిధ్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య మాట్లాడారు. అదానీ, అంబానీ కోసం మోడీ ప్రభుత్వం దేశాన్ని కొల్లగొడుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వినతిపత్రం ఇచ్చే పరిస్థితులూ లేవని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. రాష్ట్ర నేత ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో పరువు హత్యలు అవుతున్నాయన్నారు. సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా రాష్ట్ర నేత కె.రంగయ్య మాట్లాడుతూ.. కేంద్ర తప్పుడు విధానాలతోనే ప్రజలపై ధరల భారం పడిందన్నారు.