
మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మాజీ విప్ ఈరవత్రి అనిల్ లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన శశిధర్ .. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పై చేసిన వ్యాఖ్యలకు గానూ శశిధర్‌రెడ్డికి ఈ నోటీసులిచ్చారు. మాణిక్కం ఠాగూర్... రేవంత్ రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ శశిధర్‌రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఠాగూర్ పుట్టక ముందు నుంచి తాను రాజకీయాలు చూస్తున్నానన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందంటూ శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు . రేవంత్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆయన తీరు వల్లే ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందన్న.. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉండడన్నారు. కాగా, మర్రి శశిధర్‌రెడ్డి రేపు బీజేపీలో చేరనున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.