కరోనా టెన్షన్​ .. నిమ్మకాయలకు ఫుల్ గిరాకీ

కరోనా టెన్షన్​ .. నిమ్మకాయలకు ఫుల్ గిరాకీ

చైనాలో ఓ వైపు కరోనా విజృంభిస్తుండగా.. మరోవైపు నిమ్మకాయలకు అమాంతం డిమాండ్​ పెరిగింది. అవి హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాటిని కొనేందుకు జనం క్యూ కడుతున్నారు. ఇంతకీ నిమ్మకాయలకు ఎప్పుడూ లేనంత డిమాండ్​ ఇప్పుడే చైనాలో ఎందుకొచ్చింది  అనే సందేహం వస్తుందా ? అయితే ఈ కథనం మొత్తం చదవండి.  శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో నిమ్మకాయలు ఉపయోగపడతాయని తాజాగా పలు అధ్యయన నివేదికలు వచ్చాయి. దీంతో చైనా ప్రజలు నిమ్మకాయలు కొనడానికి ఎగబడుతున్నారు. ‘నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంతకుముందు రోజుకు 6 టన్నుల నిమ్మకాయలు అమ్మేవాళ్లం.. ఇప్పుడు 30 టన్నుల వరకు అమ్ముడుపోతున్నాయి’ అని సిచుయాన్ లోని అనియు కౌంటీకి చెందిన ఓ రైతు మీడియాకు చెప్పాడు. నిమ్మకాయలతో పాటు ఆరెంజ్, పియర్స్, పీచ్ వంటి పండ్లకు సైతం గిరాకీ బాగా పెరిగిందని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తోంది. జీరో కోవిడ్ నిబంధనను ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్డుకెక్కడంతో చైనా సర్కారు ఆంక్షలను కొంత సడలించింది. దాంతో చైనాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రానున్న రోజుల్లో చైనాలో 60 శాతం మందికిపైగా జనాభా వైరస్​ బారినపడే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు హోం క్వారంటైన్ పై దృష్టిపెట్టారు.