న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనిల్ అంబానీ టెలికం కంపెనీ ఆర్‌కామ్ నుంచి రావాల్సిన పాతబాకీ రూ.580 కోట్లు వసూలు చేసుకున్న స్వీడన్ కంపెనీ ఎరిక్సన్‌కు మరో ఇబ్బంది తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డబ్బును తమకే చెల్లించాలని ఆర్‌కామ్‌కు అప్పులు ఇచ్చిన లెండర్లు ఎరిక్సన్‌ను కోరనున్నారు. ఈ మేరకు త్వరలోనే డిమాండ్ నోటీసు పంపుతారని తెలుస్తోంది. ఎరిక్సన్ చెల్లింపు దివాలా చట్టంలోని ‘ప్రిఫరెన్షియల్ ట్రాన్సాక్షన్’ కిందకు వస్తుంది కాబట్టి అది తమకే దక్కాలని ఆర్‌కామ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ) స్పష్టం చేసింది. దీని ప్రకారం వచ్చే రుణం మొత్తాన్ని మొదట ఫైనాన్షియల్ క్రెడిటర్‌కు లేదా సీఓఓకి మాత్రమే చెల్లించాలి. ఎరిక్సన్ ఆపరేషనల్ క్రెడిటర్ అవుతుందని సీఓసీ వాదిస్తోంది. ఎస్‌బీఐ నాయకత్వంలోని లెండర్ల కన్సార్షియం ఈ మేరకు త్వరలోనే ఎరిక్సన్‌కు లేఖ రాయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌కామ్ దివాలా కేసు ఎన్సీఎల్టీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎరిక్సన్ డబ్బు కట్టడానికి తిరస్కరిస్తే కోర్టుకు వెళ్లే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. దీనిపై ఎరిక్సన్ ప్రతినిధి స్పందిస్తూ ఆర్‌కామ్ లెండర్ల నుంచి తమకు ఎలాంటి నోటీసూ రాలేదని చెప్పారు. ఎస్‌బీఐ కూడా ఈ విషయమై మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. ఆర్‌కామ్, దీని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ తమకు రూ.85 వేల కోట్లు అప్పు ఉన్నారని సీఓసీ ప్రకటించింది.
