29 మిల్లీమీటర్ల సముద్ర పురుగు..157 డెసిబల్స్ సౌండు
సౌండ్ పొల్యూషన్ చాలా డేంజర్. వినాల్సిన పరిధికి మించి కాస్త ఎక్కువైనా పిచ్చెక్కిపోతుంది. కర్ణభేరి పగిలిపోతుంది. చెవుల్లోంచి రక్తమొచ్చేస్తుంది. అలాంటి సౌండ్స్ ఏ పెద్ద పెద్ద మెషీన్లో, విమానాలో, రాకెట్లో చేస్తాయనుకోండి. కానీ సైంటిస్టులు ఈ మధ్య విచిత్రమైన విషయాన్ని కనుగొన్నారు. సముద్రంలో ఉండే 29 మిల్లీమీటర్ల చిన్న పురుగు కర్ణభేరి వాచిపోయేలా అరుస్తుందని గుర్తించారు. దాని పేరు లియోక్రటైడ్స్ కిమురావోరం. ఇంతవరకు ఈ పురుగులు సౌండ్ చేయకుండా ఉంటాయనుకున్నామని, కానీ సుమారు 157 డెసిబల్స్ సౌండ్ చేస్తాయని ఈమధ్యే తెలుసుకున్నామని క్యోటో వర్సిటీకి చెందిన మెరైన్ బయాలజిస్టు ర్యుటారో గోటో చెప్పారు.
మనిషి చెవులు తక్కువలో తక్కువ 10 డెసిబల్స్‌ను గుర్తించగలవని, సౌండ్ 130 డెసిబల్స్ దాటిందంటే చెవులు పగిలిపోతాయని, ఈ పురుగేమో అంతకుమించి సౌండ్ చేయగలదని వివరించారు. సాధారణంగా ఇలాంటి సాఫ్ట్ బాడీ పురుగులు పెద్ద సౌండ్లు చేయవని చెప్పారు. నోటితో దాడి చేసేటప్పుడు, వాటి కమ్యూనికేషన్‌లో భాగంగానూ ఇవి సౌండ్ చేస్తుండొచ్చని చెబుతున్నారు. వాటి గొంతులోని గట్టి కండరాలను తెరిచి ఇలాంటి పెద్ద సౌండ్‌ను సృష్టిస్తాయని భావిస్తున్నారు. జపాన్ తీరంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అక్కడి సీ స్పాంజుల్లో రంధ్రాలు చేసుకొని ఆహారం కోసం ఓ కంట కనిపెట్టుకొని ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద బయలాజికల్ శబ్దాలను ‘స్నాపింగ్ ష్రింప్స్’ చేస్తాయి. వాటి ఆహారాన్ని పట్టుకోడానికి 189 డెసిబల్స్ సౌండ్‌ను సృష్టిస్తాయి. ఆ దెబ్బకు ముందున్న జీవులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మరి ఈ సౌండ్ ఫోర్స్ ఎంతో తెలుసా. గాజు గ్లాసు పగిలిపోద్ది.
