
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఓ రైతు పొలంలో పనులు చేస్తుండగా చిరుత కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. ఎల్లారెడ్డి పేట మండలం రాగట్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాయం సురేశ్ సోమవారం తన పొలంలో నీళ్లు పారిస్తుండగా చిరుతపులి కనిపించింది. దీంతో సమీపంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి చిరుతపులి కనిపించినట్లు చెప్పాడు.
వారందరూ కర్రలు పట్టుకుని వెళ్లడంతో చిరుత అక్కడి నుంచి వాగులోకి పారిపోయింది. సమాచారం తెలుసుకున్న ఎఫ్ ఆర్ ఓ శ్రీహరి ప్రసాద్ తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా పొలం వద్దకు వెళ్లద్దని సూచించారు. అనంతరం చిరుత పాద ముద్రలను సేకరించారు.