పుల్వామాలో ఎన్‌‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

పుల్వామాలో ఎన్‌‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ లష్కర్-ఎ-తైబాకు చెందిన కమాండర్ ఎయిజాజ్ అలియాస్ అబు హురైరా సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు కశ్మీర్ ఐజీ వినయ్ కుమార్ చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మంగళవారం రాత్రి సెర్చింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు.. ఆర్మీపై కాల్పులు జరపారు. దాంతో బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు.

మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి రక్షణ శాఖ భద్రతా బలగాలను మొహరించింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలతో సంబంధం లేకుండా ఆర్మీని రంగంలోకి దించింది. అర్ధరాత్రి అర్నియా సెక్టార్‌లో ఓ రెడ్ లైట్ వెలుగుతూ కనిపించిందని.. వెంటనే అప్రమత్తమై రెడ్ లైట్ టార్గెట్‌గా కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. దాంతో ఆ లైట్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయిందని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అనంతరం ఆ ఏరియాలో సెర్చ్ చేస్తే.. ఎలాంటి వస్తువులు లభించలేదని తెలిపారు.