ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

 ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్ముకాశ్మీర్ లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని  జిల్లా ఎస్పీ అమోద్‌ అశోక్‌ తెలిపారు. అతను  లష్కరే తొయీబాకు చెందిన  ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.  బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు మే 06 శనివారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. 

ఈ క్రమంలో ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరపగా ఓ ఉగ్రవాది హతమయ్యాయడు. బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్‌కౌంటర్‌ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.   జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ   రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్మూలో పర్యటిస్తున్నారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.  

రాజౌరిలో ఐదుగురు జవాన్లు వీరమరణం

మే 05 శుక్రవారం తెల్లవారుజామున రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. రాజౌరిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో  జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో  జవాన్లు వీరమరణం పొందారు. ఇటీవల జమ్ము రీజియన్‌లో ఆర్మీ ట్రక్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నది.ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు ఆర్మీ జవాన్లకు జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా నివాళులర్పించారు.