
- బహుజన రాజ్యం కోసం తుదిశ్వాస వరకు పోరాడదాం
- బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సిద్దిపేట జిల్లా: పేద బడుగు బలహీన వర్గాలు వారు గొర్లు, బర్లు కాసుకుంటనే బతకాలా..? బహుజన రాజ్యం కోసం తుదిశ్వాస వరకు పోరాడదామని బీఎస్పీ రాష్ట్ర నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ముట్రాజ్ పల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి దళిత వాడలో బీఎస్పీ బీసీ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులతో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ , కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల వల్ల లబ్ది పొందిన వాడు, వందల ఎకరాలు సాగు చేసుకున్నాడో వాడు మన వాడు కాదు, దీంట్లో మునిగిన వాళ్లమే మనం అన్నారు. ఈ ప్రాజెక్టుల్లో మునిగిన బాధితుల కోసమే బహుజన రాజ్యం రావాలి, దాని కోసమే మా తుది శ్వాస వరకు పోరాడతామన్నారు. కనీసం బహుజన కుటుంబాలైన ఎస్సి, ఎస్టీ కుటుంబాలకు చెందిన పిల్లలకు బడి లేకపోవడం దురదృష్టకరమన్నారు.
అంబేద్కర్, కాన్షిరాం, బెహంతి కుమారి, మాయావతి కలలు కన్న రాజ్యం తప్పక వస్తుందని ఆయన పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుళ్లు వాళ్ల వల్లే చదువుకుని ఈ స్థాయికి వచ్చామని, పేద వర్గాలకు చెందిన ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో చూద్దాం అని ఇక్కడి వచ్చామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, ఈ ఆధిపత్య కులాలకు చెందిన పాలకులకు మన గోస పట్టదన్నారు. ఎంత సేపు వాళ్ల ఆస్తులు ఒక ఎకరం ఉన్న వాడు పది, పది ఎకరాలు ఉన్నవాడు వందల ఎకరాలు చేసుకుంటాడు, మన కూలి , కైకిలి చేసుకునే వాడి గోస పట్టదు అని ఆయన ఆరోపించారు.