బొగత అందాలు చూసొద్దాం

బొగత అందాలు చూసొద్దాం

హైదరాబాద్, వెలుగు:చుట్టూ పచ్చదనం.. అల్లంత దూరాన ఎగిసిపడుతున్న జలపాతాల హోరు.. ఆహ్లాదకర వాతావరణం. తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది కదా. ఇక అలాంటి ప్లేస్ లో కాసేపు గడిపితే ఎంత హాయిగా ఉంటుందో. మీ ఊహని నిజం చేస్తోంది తెలంగాణ టూరిజం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్ నిండు కుండలా మారింది. మాములు రోజుల్లోనే బొగత అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. వర్షాలు పడి ఎగిసిపడుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నగరం నుంచి బొగత వాటర్ ఫాల్స్ ని సందర్శించేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్​ టు బొగత

బిజిబిజీ లైఫ్ స్టైల్ తో విసిగివేసారిన సిటిజన్లు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకొంటుంటారు. అలాంటి వారికోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ కల్పించిన వన్ డే టూర్ ప్యాకేజ్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ టూర్ బషీర్ బాగ్ టూరిజం ఆఫీస్ నుంచి ఉదయం 7గంటలకు మొదలవుతుంది. ఇందులో భాగంగా మొదట లక్నవరం బ్రిడ్జ్, ఆ తరువాత బొగత వాటర్ ఫాల్స్ చూపిస్తారు. బొగత వాటర్ ఫాల్స్ టైమ్ స్పెండ్ చేశాక తిరిగి నగరానికి ప్రయాణమవుతారు. అదే రోజు రాత్రి 11గంటలకు నగరానికి చేరుకుంటారు. ఏసీ వాల్వో బస్/ఏసీ లగ్జరీ మిని బస్ అయితే పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 గా ఉంది. నాన్ -ఏసీ హైటెక్ బస్ అయితే పెద్దలకు రూ.1400, పిల్లలకు రూ.1120 లుగా ప్యాకేజ్ ధరలు ఉన్నాయి.

ఆన్​లైన్​లో టికెట్లు

వాటర్ ఫాల్స్ ప్యాకేజీ టూర్ ని అనౌన్స్ చేసిన సందర్భంగా టీఎస్టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ బి.మనోహర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చిన్న చిన్న వాహనాలు వాడటం రిస్క్ అని అన్నారు. తెలంగాణ టూరిజం అందిస్తున్న బస్ లను ఉపయోగించాలని, ఈ బస్ లు నడిపే డ్రైవర్లు ట్రైన్డ్ అండ్ ఎక్స్ పీరియెన్స్ కలిగిన వారని చెప్పారు. టూరిస్ట్ లు ఆన్ లైన్ లో కూడా బస్ టికెట్ లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్ కోసం www.tstdc.in ఆన్ లైన్ రిజర్వేషన్ సిస్టం అందుబాటులో ఉందని అన్నారు.