మాకేం కావాలో మాకు తెలుసు.. క్రికెటర్ల కౌంటర్

మాకేం కావాలో మాకు తెలుసు.. క్రికెటర్ల కౌంటర్

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలకు ప్రముఖ పర్యావరణ ఉద్యమవేత్త గ్రెటా థ‌న్‌‌బర్గ్, పాప్ స్టార్ రియన్నా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఎందుకు ఎవరూ ఈ సమస్య గురించి మాట్లాడట్లేదని రియన్నా చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. కొందరు ఆమెకు సపోర్ట్‌‌గా నిలిస్తే.. మరికొందరు విమర్శలకు దిగుతున్నారు. ఈ విషయం పై టీమిండియా క్రికెటర్లు స్పందించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ఈ ఇష్యూ పై కామెంట్ చేశారు. వీరితోపాటు లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా రియాక్ట్ అయ్యాడు. అగ్రి చట్టాల సమస్య భారత అంతర్గత విషయమని, దీంట్లో ఇతరుల జోక్యం అనవసరమని ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

‘భారత సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ ఇష్యూలో బయటి శక్తులు ప్రేక్షకుల్లాగే ఉంటాయి తప్ప భాగస్వాములు కాలేవు. భారత్‌‌కు ఏం కావలనేది భారతీయులకు తెలుసు, వారే దాన్ని నిర్ణయిస్తారు. అందరం ఓ దేశంగా ఐకమత్యంగా ఉందాం’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కోరాడు.

‘విభేదాలు పెచ్చుమీరుతున్న ఈ సమయంలో మనందరమూ కలసికట్టుగా ఉందాం. రైతులు ఈ దేశంలో అంతర్భాగం. ఈ సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా. అన్ని పార్టీలు కలసి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకొని ముందుకెళ్తాయని నమ్ముతున్నా’ అని విరాట్ ట్వీట్ చేశాడు.

‘మనం ఐకమత్యంగా ఉంటే పరిష్కారం కాని విషయాలే ఉండవు. అందరం కలసికట్టుగా ఉండి మన అంతర్గత సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేద్దాం’ అని రహానె చెప్పాడు.