అగ్రగామిగా హైదరాబాద్.. ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుదాం

అగ్రగామిగా హైదరాబాద్.. ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుదాం
  • అమెరికాకు మీరే ఆయువు పట్టుగా ఉన్నారు
  • రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి
  • తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి
  • న్యూ జెర్సీలో ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్ ను  ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  “తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది.

 మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుంది..’అని అన్నారు.  ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగిందని, గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారనని,  వచ్చినా నిలబడదని అన్నారని సీఎం చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

వాళ్లకు ఇప్పటికే బుద్ధి చెప్పామని, అబద్ధాల కోరుల మాటలు తప్పని నిరూపిద్దామని , హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలుపుదామని సీఎం పిలుపునిచ్చారు. ప్రవాసులు తమ నైపుణ్యాలు, మీ  ప్రతిభా పాటవాలతో  అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని, ఇకపై తెలంగాణకు సేవలు అందించాలని కోరారు. 

మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేద్దాం

తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

 ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను తీర్చిదిద్దనున్నామని అన్నారు.  ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరింది. ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలి’ అన్నారు.  సాఫ్ట్‌వేర్, ఫార్మా, వ్యాక్సిన్‌లు, హెల్త్‌కేర్‌,  అర్టిఫిషియల్ రంగాల్లో తెలంగాణ బలమైన స్థావరంగా ఎదగాలని ఆకాంక్షించారు.