లెటర్​ టు ఎడిటర్ : జాతరలలో జర జాగ్రత్త

లెటర్​ టు ఎడిటర్ :  జాతరలలో జర జాగ్రత్త

పండుగల సందర్భంగా జాతరలు,వేడుకలు జరుగుతుంటాయి.మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ముత్యాలమ్మ పేరుతో జాతరను నిర్వహిస్తారు.ఇంకా గంగానమ్మ, మైసమ్మ, పోచమ్మ, అంకమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరునాళ్లు నిర్వహిస్తారు.అదే విధంగా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున రెండు మూడు రోజులు తిరునాళ్లు నిర్వహిస్తారు. ఇవన్నీ మన సంస్కృతి , సంప్రదాయాలలో భాగంగా జరుపుకుంటారు.వివిధ జాతరలు, తిరునాళ్లు సందర్భంగా ఊరంతా సందడిగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు కలవడానికి ఇవి చక్కటి వేదికలుగా ఉపయోగపడతాయి. 

కొన్ని జాతరలని ఏడాదికి ఒకసారి నిర్వహిస్తారు.  సమ్మక్క సారక్క వంటి మరికొన్ని జాతరలని రెండు ఏండ్ల కొకసారి నిర్వహిస్తారు. జాతరల సమయంలో పెద్ద ఎత్తున ఒకే చోట జనం చేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేయకపోతే ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడుతుంది. అదేవిధంగా ఆహార కొరత ఏర్పడుతుంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎలాగూ తప్పవు.అలాగే వివిధ ప్రాంతాల్లో జాతరలు ముగిసిన వెంటనే సరైన పరిశుభ్రత చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆ ప్రాంతంలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంటుంది. తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా ఫిబ్రవరి నెల నుండి మే నెల వరకు తిరునాళ్ళు జాతరలు ఎక్కువగా జరుగుతాయి. తిరునాళ్ళు సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులకి మంచి డిమాండ్ వుంటుంది. ప్రభుత్వాలతో పాటు, ప్రజలు కూడా జాతర్ల సమయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

జాతరలు జరిగే ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా  స్వీయ నియంత్రణ పాటించాలి. అనారోగ్య సమస్యలు వున్న వారు కొంతకాలం పాటు జాతరలకు  దూరంగా ఉంటే మంచిది. ఇటువంటి వేడుకల సందర్భంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి.కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అలాగే జీవ హింస కూడా ఎక్కువగా జరుగుతుంది. మితి మీరిన జీవహింసకు బదులు మరేదైనా  ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలి. మద్యం అమ్మకాలపై నియంత్రణ వుండాలి.ఆచారాలను ప్రజలు పాటిస్తూనే, కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎం. రాం ప్రదీప్.