లెటర్​ టు ఎడిటర్​ : పదేండ్ల తర్వాత ప్రజాస్వామ్యం కనిపిస్తున్నది

లెటర్​ టు ఎడిటర్​ :   పదేండ్ల తర్వాత ప్రజాస్వామ్యం కనిపిస్తున్నది

పరిపాలన గాడిలో పడింది. వెనువెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రతిపక్షాలకు కూడా సమాన హోదాను  కల్పించడం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. చాలా ఏండ్ల తర్వాత ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొన్నట్టు ముచ్చట గొలిపింది.  తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం  పదేళ్లలో చేసిన కార్యక్రమాలన్నింటినీ సమీక్ష చేసి, దాని ఆధారంగా శ్వేత పత్రాన్ని   ప్రజలకు విడుదల చేసి, దానిపై అర్థవంతమైన చర్చను చేసి, రేవంత్ రెడ్డి చాలా మంచి పనే చేశారు. నియంతృత్వ విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వాన్ని దశాబ్ద కాలం పాటు సాగించిన ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి ఆసిడ్ పరీక్ష చేయవలసిందే.

 లేకపోతే ఈ పాపమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుట్టుకునే అవకాశం ఉందనే.. ముందు చూపు గల నాయకత్వం లభించడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక శుభ సంకేతం. రాజకీయ సుస్థిరత, అస్థిరత అంటూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అసెంబ్లీలో పెచ్చరెల్లి మాట్లాడారు. బయట వేదికల పైన ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వారి నియంతృత్వ ధోరణికి నిదర్శనం. ప్రజల అభిప్రాయాన్ని అగౌరవపరుస్తూ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీరాలు పలుకుతున్నారు.  

ఇప్పటికే వారు ఎందుకు ఓడిపోయారో, ఎవరు తమను ఓడించారో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నారు. అధికారం పోయిందనే నిరాశలో వారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియడం లేదు.  ఓటమి వారిని ఎంతగా గాయపరిచిందో ఊహించవచ్చు. తామే తెలంగాణకు పెద్ద దిక్కు అని చెప్పుకునే వారికి ఓటమి రుచి ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు చూపించారు. ఇప్పటికైనా వారు ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా తమ  ప్రవర్తనను మార్చుకోకుంటే తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై వారి ఉనికి అదృశ్యమయ్యే అవకాశాలు స్పష్టంగా  కనిపిస్తున్నాయి. 

- కె. శ్రీనివాసాచారి, అధ్యక్షుడు, తూప్రాన్ పరిరక్షణ సమితి