బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌లో టైటిల్ నిలబెట్టుకోవడమే టార్గెట్‌గా కొత్త సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన టీమ్‌మేట్స్ కీలక సూచన చేశాడు. ప్రాక్టీస్ సెషన్లలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ‘స్విచ్ ఆన్’ కావాలని కోరాడు. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ ప్రసంగించాడు. గత ఏడాది టైటిల్ గెలవడానికి పడ్డ కష్టాన్ని గుర్తు చేస్తూ.. ఈసారి ఇతర జట్లు మరింత కసిగా వస్తాయని, అందుకే ఆర్సీబీ ప్లేయర్లంతా రెట్టింపు ఉత్సాహంతో ఉండాలని సూచించాడు.
‘గత రెండు మూడు సీజన్లుగా మనం ఎంతో కష్టపడి సాధించిన విజయం ఇది. ఈ ఏడాది సవాలు మరింత కఠినంగా ఉండబోతోంది. అందుకే ఈ రెండున్నర నెలల పాటు మన 120 శాతం శ్రమను అందించాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ నెల 28న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
ఈసారి వేలంలో జట్టులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, సాత్విక్ దేశ్వాల్ వంటి కొత్త ఆటగాళ్లతో జట్టు మరింత బలోపేతమైందని హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ధీమా వ్యక్తం చేశాడు. టీమ్ జెర్సీపై చాంపియన్ అని తెలిపే ‘స్టార్’ ఉండటం గర్వకారణమని, అయితే పాత విజయాన్ని మరిచి కొత్త లక్ష్యం వైపు పయనించాలని కోచ్ సూచించాడు.
