
- ఈ ఘనత ఏడుసార్లు సాధించిన తొలి ప్లేయర్‌గా నొవాక్ రికార్డు
- అల్కరాజ్, సబలెంకా ముందంజ
న్యూయార్క్: గాయాలు వెంటాడుతున్నా.. ఫిట్‌నెస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. యువ ఆటగాళ్లు సవాల్ విసురుతున్నా.. లెజెండరీ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 38 ఏండ్ల వయసులోనూ అసాధారణ పోరాట పటిమ చూపెడుతూ చాన్నాళ్లుగా తనను ఊరిస్తున్న 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.
యూఎస్ ఓపెన్‌లో అద్భుత ఆటతో అతను సెమీఫైనల్ చేరుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ నొవాక్ 6-–3, 7–-5, 3–-6, 6-–4 తో అమెరికా స్టార్, గత ఎడిషన్ ఫైనలిస్ట్ టేలర్ ఫ్రిట్జ్‌పై విజయం సాధించాడు. దాంతో ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలోనూ సెమీ ఫైనల్స్‌కు చేరాడు. ఈ ఘనతను ఏడుసార్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఫ్రిట్జ్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన నొవాక్.. యూఎస్ ఓపెన్‌లో 14వ సారి సెమీస్‌లో అడుగు పెట్టాడు.
మొత్తంగా మేజర్ టోర్నీల్లో 53వ సెమీస్ బెర్తుతో తన రికార్డు మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫైనల్ బెర్తు కోసం నొవాక్... ఐదు గ్రాండ్ల్‌స్లామ్స్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) మరో క్వార్టర్ ఫైనల్లో 6–4, 6–2, 6–4తో వరుస సెట్లలో 20వ సీడ్ జిరి లెహెకా (చెక్ రిపబ్లిక్)ను చిత్తుగా ఓడించాడు.
గంటా 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో కార్లోస్ ఒక్కసారి కూడా సర్వీస్ కోల్పోలేదు. ఐదు ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టిన అతను నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించి ముందంజ వేసి జొకోతో పోరుకు సిద్ధమయ్యాడు.
విమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంకా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రత్యర్థి, మార్కెటా వోండ్రుసోవా మోకాలి గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంది. వాకోవర్‌తో టాప్ సీడ్ అరీనా నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టినా..
జొకోవిచ్, నాలుగో సీడ్ ఫ్రిట్జ్ మధ్య క్వార్టర్స్ ఫైట్ మూడు గంటల 24 నిమిషాల పాటు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. సెర్బియా స్టార్ తొలి రెండు సెట్లను సులభంగా గెలుచుకొని 2–0తో లీడ్‌లోకి వచ్చాడు. కానీ, మూడో సెట్‌లో ఫ్రిట్జ్ నుంచి ప్రతిఘటన ఎదురవగా.. అతనికి మద్దతుగా భారీ సంఖ్యలో వచ్చిన ప్రేక్షకుల వైపు నుంచి అరుపులు, కేకలతో జొకోవిచ్ ఇబ్బందిపడ్డాడు.
సహజంగా సర్వీస్ చేస్తున్న టైమ్‌లో అతను నిశ్శబ్దాన్ని కోరుకుంటాడు. అదే టైమ్‌లో ఫ్యాన్స్ గట్టిగా అరుస్తుండటంతో ఆటపై ఏకాగ్రత చూపలేపోయాడు. ఓ దశలో ఫ్యాన్స్‌ను సైలెంట్‌గా ఉంచమంటూ చైర్ అంపైర్‌తో జొకో వాగ్వాదానికి కూడా దిగాడు. చివరకు మూడో సెట్ కోల్పోయినా.. నాలుగో సెట్‌లో నొవాక్ మళ్ళీ తన అనుభవాన్ని ఉపయోగించి ఫ్రిట్జ్‌పై ఒత్తిడి పెంచాడు.
చివరి గేమ్‌లో ఫ్రిట్జ్ రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకున్నా, నిర్ణయాత్మకమైన పాయింట్‌లో డబుల్ ఫాల్ట్‌తో ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో పది ఏస్‌లు కొట్టిన నొవాక్.. 22 నెట్ పాయింట్లు, 4 బ్రేక్ పాయింట్లు నెగ్గి 33 విన్నర్లు రాబట్టాడు. 8 డబుల్ ఫాల్ట్స్, 40 అనవసర తప్పిదాలు చేశాడు. 12 ఏస్‌లు, 46 విన్నర్లు కొట్టిన ఫ్రిట్జ్ 15 నెట్ పాయింట్లు, 2 బ్రేక్ పాయింట్లతో సరిపెట్టాడు. ఐదు డబుల్ ఫాల్ట్స్, 42 అనవసర తప్పిదాలు చేశాడు.
క్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ
మెన్స్ డబుల్స్‌లో ఇండియా ప్లేయర్ యూకీ భాంబ్రీ తన కెరీర్‌లోనే తొలిసారి గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో యూకీ– మైఖేల్ వీనస్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–-4, 6–-4 తో వరుస సెట్లలో నాలుగో సీడ్ జర్మనీ జంట కెవిన్ క్రావియెట్జ్– టిమ్ ప్యూట్జ్‌ను ఓడించింది.
కూతురు బర్త్‌డే.. నొవాక్ డ్యాన్స్
క్వార్టర్స్ నెగ్గిన వెంటనే నొవాక్ తనదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కెపాప్ డెమోన్ హంటర్స్ అనే పాపులర్ సినిమాలోని ‘సోడా పాప్’ పాటకు డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన గట్టి అరుపులకు జవాబుగా ఈ డాన్స్ చేశాడని అంతా భావించారు. కానీ, మంగళవారం తన కూతురు తారా ఎనిమిదో బర్త్ డే కావడంతో ఆమె కోసం డ్యాన్స్ చేసినట్లు తర్వాత జొకోవిచ్ వివరించాడు. తారా బర్త్‌డేకు ఇది స్పెషల్ గిఫ్ట్ అన్నాడు. ఇంట్లో కూతురితో కలిసి వివిధ రకాల స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తానని, ఈ డ్యాన్స్ వాటిలో ఒకటన్నాడు.