
- తొలి విడతలో 3, 465 మందికి.. డిసెంబర్ రెండో వారంలో మరికొంత మందికి
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి మండలానికి కనీసం నలుగురి నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఈ నెల 19న శిల్పా కళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని రెవెన్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, సర్వే విభాగం కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో మంత్రి పొంగులేటి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములకు సంబంధించిన అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే గ్రామపాలనాధికారులు ( జీపీవో)ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జత పరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత కీలకం కానుందన్నారు.
భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 350 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంత మంది సర్వేయర్లు అవసరమవుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక వైపు లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులు భర్తీచేయడం, ఇంకోవైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునికి పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సర్వే వ్యవస్థతో భూవివాదాలు తగ్గుతయ్
సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడానికి దరఖాస్తులను ఆహ్వానించగా పది వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో తొలివిడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చామని, వారిలో 3,465 మంది అర్హత సాధించారని చెప్పారు. భూవిస్తీర్ణాన్ని ప్రకారం ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురిని లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు.
రెండో విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభించామని ఈనెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 40 రోజుల అప్రెంటీస్ శిక్షణ ఉంటుందని వీరి సేవలు కూడా డిసెంబర్ రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్నప్పుడే వివాదాలు తగ్గుతాయన్నారు. సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందన్నారు.