
తిరుమలలో పరిశుభ్రత, కోవిడ్ నివారణ చర్యలు ఆకట్టుకున్నాయని జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాదసేవలో పాల్గొన్న జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మనోజ్ సిన్హాకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. గవర్నర్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. ‘చాలాసార్లు స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చాను. కోవిడ్ దృష్ట్యా అధికారులు తీసుకున్న నివారణ చర్యలు చాలా బాగున్నాయి. టీటీడీ కోవిడ్ నిబంధనలు చాలా అద్భుతంగా అమలు చేస్తుంది. భక్తులు కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి వారి కరుణతో కోవిడ్ నుంచి బయటపడుతామని ఆశిస్తున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.