పరువు హత్య నిందితులకు జీవిత ఖైదు తప్పదు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

పరువు హత్య నిందితులకు జీవిత ఖైదు తప్పదు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
  • దళిత యువకుడి కుటుంబానికి రూ.4 లక్షలు ఎక్స్​గ్రేషియా

షాద్ నగర్, వెలుగు: ఎల్లంపల్లిలో ఇటీవల పరువు హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని ఎస్సీ,  ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య గురువారం పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4.12 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పరువు హత్యలు జరగడం బాధాకరమన్నారు.

రాజశేఖర్​ను హత్య చేసిన వారికి కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, ఐదెకరాల భూమి అందజేస్తామని, ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని  హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్ నగర్ ఆర్డీవో సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్ కుమార్ ఉన్నారు.