
వరద పరవళ్లకు ఓవర్ ఫ్లో అవుతున్న డ్యామ్
ఇన్ ఫ్లో: 56 వేల 241 క్యూసెక్కులు… అవుట్ ఫ్లో: 56 వేల 241 క్యూసెక్కులు
కర్నూలు: భారీ వర్షాలకు తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. కర్నాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయిలో నిండిపోయి ఓవర్ ఫ్లో అవుతోంది. దీంతో వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ ఉదయం 15 గేట్లు ఎత్తారు. గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టులోనే డ్యామ్ నిండిపోయింది. ఇంత భారీగా వరద రావడం ఈ సీజన్లో ఇదే తొలిసారి.
మరో వైపు తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తుండడంతో డ్యామ్ కు వరద పరవళ్లు తొక్కుతోంది. మరో రెండు రోజులు వరద ఉధృతి కొనసాగినా.. వర్షపాతం ఆధారంగా.. కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1632.25 అడుగుల నీటిమట్టం మెయిన్ టెయిన్ చేస్తున్నారు. డ్యామ్ మొత్తం కెపాసిటీ 100 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 97.970 టీఎంసీలను నిల్వ ఉంచుతూ.. వరద నీటిని దిగువన నదిలోకి విడుదల చేస్తున్నారు.