
- పర్యాటకులను ఆకట్టుకునేలా హెచ్ఎండీఏ ప్రణాళిక
- ఫీజుబిలిటీ టెండర్ దక్కించుకున్న నైట్ ఫ్రాంక్ సంస్థ
- మూడు నుంచి నాలుగు నెలల్లో నివేదిక
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏలోని ఉమ్టా అధికారులు గోల్కొండ వద్ద తలపెట్టిన రోప్‌వే నిర్మాణానికి లైన్‌క్లియర్ అయ్యింది. ప్రభుత్వం అనుమతించడంతో గోల్కొండ నుంచి కుతుబ్‌షాహీ టూంబ్స్ వరకూ 1.5 కి.మీ. రోడ్‌వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది.
దీనికి సంబంధించి ఫీజుబిలిటీ రిపోర్ట్తయారు చేసేందుకు ఆయా కన్సల్టెన్సీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించగా, ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఎంపికైంది. ఈ సంస్థ గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకూ ప్రాజెక్టు ఫీజుబిలిటీపై నివేదిక తయారు చేయనుంది.
ముఖ్యంగా గోల్కొండ వద్ద రక్షణ శాఖకు చెందిన స్థలాలు ఉండడం వల్ల రైట్‌ఆఫ్‌వే నిర్మాణానికి అవసరమైన అధ్యయనంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన వివిధ వనరులను కూడా సమీకరిస్తుందని అధికారులు తెలిపారు.
రోజూ వేలాది మంది సందర్శకులు
ముఖ్యంగా ప్రతి రోజూ వేలాది మంది గోల్కొండకు సందర్శకులు వస్తుంటారు. అలాగే దానికి సమీపంలోనే ఉన్న చారిత్రక కుతుబ్షాహీటూంబ్స్ను కూడా సందర్శిస్తుంటారు. అయితే గోల్కొండ నుంచి కుతుబ్‌షాహీ టూంబ్స్ వరకూ 1.5 కి.మీ. రహదారిలో ప్రతి రోజూ ట్రాఫిక్ జామ్‌లు, ఇతర సమస్యలు అంటే సరైన రవాణా వ్యవస్థ అందుబాటులో లేక పోవడం వల్ల చాలా మంది టూరిస్టులు వెనుదిరిగి వెళ్తుంటారు. ఈ పరిస్ధితిని నివారించి నేరుగా రోప్‌వే ద్వారానే గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకూ ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్టును చేప్టటాలని నిర్ణయించారు.
రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి!
రోప్‌వే ప్రాజెక్టుకు సంబంధించి ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను నైట్ఫ్రాంక్సంస్థ మూడు నుంచి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. నివేదిక ఇవ్వగానే డీపీఆర్‌ను తయారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలోని ఉదయ్‌పూర్, నలంద, డార్జిలింగ్, సిమ్లా, ముస్సోరి వంటి ప్రాంతాల్లో రోప్‌వేలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎత్తయిన కొండలు, పర్వాతాలను కలుపుతూ వీటిని నిర్మించారు. కానీ గోల్కొండ – కుతుబ్‌షాహీ టూంబ్స్ తక్కువ ఎత్తులో నుంచే ప్రయాణించేలా అధికారులు ప్రాజెక్టును రూపొందించనున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే గోల్కొండ– కుతుబ్‌షాహీ టూంబ్స్ భారీ ఎత్తున టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్దతిలో నిర్మించనున్నారు. దీంతో హెచ్ఎండీఏపై పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండదని భావిస్తున్నారు.